కరోనా@ 2020.. మరచిపోలేని ఓ పీడకల!

by  |
కరోనా@ 2020.. మరచిపోలేని ఓ పీడకల!
X

కరోనా ఓ కరోనా..
– పేదలు ఉపాధి కోల్పోయారు. తిండికి కూడా తిప్పలు పడే రోజులు వచ్చాయి. వ్యవసాయం తప్ప మిగతా రంగాలు అన్నీ కుప్పకూలాయి. కూలీ చేసుకుందామనుకున్నా పోటీ ఏర్పడింది.
– మధ్య తరగతి ఆశలు గల్లంతయ్యాయి. కావలసినంత జీవితం ఉంది.. సంపాదనా ఉందని ఖర్చులకు వెనుకాడని జనానికి కరోనా గుణపాఠం నేర్పింది. సంపాదన తగ్గింది. ఖర్చులు తగ్గించుకున్నారు.
-జనం నిత్యావసర సరుకులు తప్ప విలాస వస్తువుల వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని పరిస్థితి ఏర్పడింది.
-సంపన్నుల పరిస్థితి కూడా తలకిందులయ్యింది. కంపెనీలు, వ్యాపారాలు, వ్యవహారాలు దెబ్బతినడంతో వారు కూడా అయోమయంలో పడిపోయారు. ఆర్థికంగా నష్టాలు చవిచూశారు.
– ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర సంస్థలు ఇరకాటంలో పడిపోయాయి. ఉనికిని నిలుపుకొనేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. కమర్షియల్ స్పేస్ వదిలించుకుంటున్నాయి.
– నగరాలు, పట్టణాల నుంచి చాలా మంది ఊరిబాట పట్టారు. విద్యాధికులు, ధనికులు కూడా వ్యవసాయం మీద ఆసక్తి చూపించడం ప్రారంభించారు. దీంతో పల్లెలు కళకళలాడాయి.
– రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో పడింది. దానిపై ఆధారపడిన లక్షలాది మంది రోడ్డున పడ్డారు.
– మార్చి నుంచి చిట్టీలు ఆగిపోయాయి. లావాదేవీలు నిలిచిపోయాయి. జనానికి చెల్లింపు సామర్థ్యం తగ్గిపోయింది.
-అయినవారికి కూడా సమయమివ్వలేనంత బిజీగా ఉండేవారు సొంత మనుషులు, బంధుమిత్రులతో గడిపారు. వారితోనే కలిసి పని చేశారు.
-కరోనాకు ముందు ఏది కనబడితే దానిని లాగించేవారు. కొత్త రుచుల కోసం ఆరాటపడేవారు. ఇపుడు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. ఏరికోరి మరీ కావలసిందే తింటున్నారు.
-పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గాయి. వలస కార్మికులు ఇండ్లకు వెళ్లిపోయారు. మూడు ఫిఫ్టులలో నడిచే పరిశ్రమలు కొద్ది సమయానికే పరిమితమయ్యాయి. కొన్ని మొత్తానికే మూతపడ్డాయి.
– జూన్ నెలలో ఎగుమతులు 25 శాతానికి పడిపోయాయి. ఎంఎస్ఎంఈలకు రోజూ రూ.4 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉండేది. ఇప్పడది రూ.1500 కోట్లకు పడిపోయింది.
-కొనుగోలు విధానం కూడా మారిపోయింది. జనం ఏది అవసరమో అదే కొంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మినహా మరే ఇతర పరిశ్రమలకు డిమాండ్ లేదు.
– మార్చి నుంచి డిసెంబరు వరకు మానవ వనరుల కొరత, భౌతికదూరం, రా మెటీరియల్ కొరత పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించింది.
– నివాస ప్రాంతాలతోపాటు వాణిజ్య ప్రాంతాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాదిని 2020 అనేకంటే కరోనా ఇయర్ అంటే సరిగ్గా సరిపోతుంది. ప్రతి జీవితంపై కరోనా ప్రభావం పడింది. దీని బారిన పడని మనిషి లేడంటే ఆశ్చర్యం కలగదు. కార్మికుడి నుంచి ఐఏఎస్ అధికారి వరకు, కిరాణా షాపు యజమాని మొదలుకొని పారిశ్రామికవేత్త వరకు ఇబ్బంది పడ్డారు. జనవరిలో భయం మొదలైంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కొనసాగింది. డిసెంబరు నాటికి జీవితంపై కొద్దిగా నమ్మకం కలిగింది. మొత్తంగా ఏడాది కాలాన్ని కరోనా భూతం హరించింది. గడప దాటనివ్వలేదు. పనులు చేసుకోనివ్వలేదు. తోటి మనుషులనే దూరం పెట్టింది. బంధుమిత్రులను కలచివేసింది. ప్రయాణాలను బంద్ చేసింది. చావులను కళ్లారా చూడనివ్వలేదు. పెళ్లిళ్లకు దూరం చేసింది. జీవనశైలిలో మార్పును తీసుకొచ్చింది. మంచి చెడును రెండింటిని చూపించింది. ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పింది.

అంతా తలకిందులు..

చిన్న పిల్లాడి నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుడి వరకు ‘కరోనా’అంటే తెలియనివారు లేరు. అందుకే ఇది కరోనా నామ సంవత్సరం. ప్లాన్లు మారాయి. కలలు కల్లలయ్యాయి. పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. భవిష్యత్ ప్రణాళికలు గందరగోళమయ్యాయి. విద్యార్ధి, టీచర్, లెక్చరర్, వ్యాపారి, పొలిటిషియన్, పారిశ్రామికవేత్త, క్యాబ్ డ్రైవరు, సాఫ్ట్ వేర్ ఇంజినీరు, రైతు, డాక్టర్, శాస్త్రవేత్త ఇలా ఒక్కరేమిటి? ప్రతి ప్రొఫెషన్ లోనూ మార్పులొచ్చాయి. జనవరి నెలకు డిసెంబరు నెలకు మధ్య ఎన్నెన్నో అవాంతరాలు, మరెన్నో వింతలు, ఆర్ధిక భారం, మరణాలు, జబ్బులు, చికిత్సలు, ప్రయాణాలలో ఆటంకాలు ఇలా ఎన్నెన్నో అంశాలను కళ్లారా చూశారు. జీవితం కొత్త అనుభవాలను నేర్పింది. సరికొత్త పాఠాలను చదివించింది. కొత్త రోజులను అలవాటును చేసింది. అందుకే ఈ ఏడాది సమీక్ష కంటే వచ్చిన మార్పులేమిటో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఏడాది ప్రతి వ్యక్తిలో కొత్తదనం కనబడింది. పాత పద్ధతులను దగ్గరికి చేర్చింది. ఆప్యాయతలను, అనురాగాలను పంచింది. వివాదాలనూ సృష్టించింది. ఆస్తి పంపకాలలో తేడాలొచ్చాయి. దంపతుల మధ్య అన్యోన్యం పెరిగింది. కొన్ని జంటల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. గొడవలు పెరిగినట్లు ఫిర్యాదుల లెక్కలు చెబుతున్నాయి.

తక్కువలో జీవించగలమని తెలిసింది

అతి తక్కువ సంపాదనతోనూ హాయిగానే బతకొచ్చునని కరోనా నిరూపించింది. భారతీయ సంప్రదాయం ఎంత మంచిదో జనం అర్ధం చేసుకున్నాం. పూర్వపు రుచులకు అలవాటు పడుతున్నాం. కషాయం వంటివి తాగుతున్నాం. జొన్న రొట్టెలు తింటున్నాం. భౌతికదూరం పాటిస్తున్నాం. ఎక్కడికి వెళ్లొచ్చినా కాళ్లు, చేతులు కడుక్కుంటున్నాం. భయం.. భక్తి అలవడింది. పాత వస్తువులను వాడుతున్నాం. ఇనప కడాయి వంటివి వినియోగించాలని తెలిసింది. ఖరీదైన డ్రెస్ స్టయిల్ నుంచి సాధారణ బట్టలతోతోనే గడిపేస్తున్నాం. జీవితపు విలువను తెలుసుకున్నాం. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటునందించింది. సొంతంగానే పనులు చేసుకుంటున్నారు. ఉన్నంతలోనే సర్దుకుపోయే గుణాన్ని అలవర్చుకున్నాం. కొత్త ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నం. ఈ ఏడాదంతా మర్చిపోలేని విధంగా గడిచిపోయింది.

–డా.షర్మిలానాగరాజ్ నందుల, కౌముది స్టూడియో ఫౌండర్, హైదరాబాద్

చాలా వదులుకున్నాం

ఫీల్డ్​ విజిట్​ చేయలేకపోయాం. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నాం. మా పరిశోధన మొత్తం బయటే ఉంటుంది. ఈ ఏడాదిలో చాలా కాలం ఎక్కడికీ వెళ్లలేకపోయామన్న బాధ ఉంది. అనుకున్న స్థాయిలో ఫీల్డ్​ రీసెర్చ్ చేయలేదు. కరోనా తర్వాత మా ఆఫీసులోనూ చాలా మార్పులు వచ్చాయి. గతంలో వాహనాన్ని ఎక్కడో ఒక చోట పార్కింగ్​ చేసి వచ్చేవాళ్లం. ఇప్పుడు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. బయట ఫుడ్ ​ఇష్టపడేవాళ్లం. హోటళ్లకు వెళ్లేవాళ్లం. తెప్పించుకునేవాళ్లం. ఇప్పుడది పూర్తిగా మానేశాం ఇంటి దగ్గరి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవడం అలవాటైంది. ఆఖరికి మంచినీళ్లు కూడా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. శుభ్రత అలవాటైంది. తరచూ చేతులు కడుక్కోవడం, కాళ్లు కడుక్కోవడం తప్పనిసరైంది.

–డా.వాసుదేవరావు, శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య సంస్థ

మేమూ భయపడ్డాం

కరోనా కొత్తగా అనిపించింది. స్టడీ చేయడం, చికిత్స చేయడం తప్పనిసరైంది. మొదట రెండు పీపీఈ కిట్లు ధరించి పేషెంట్లను ముట్టుకునేవాళ్లం. అయినా కొందరు కరోనాబారిన పడ్డారు. దాంతో చాలా భయమేసింది. ఏం ట్రీట్​మెంట్​ చేయాలో తెలియదు. మెడిసిన్ పై అవగాహన లేదు. క్లినిక్కులు చాలా మూతపడ్డాయి. డాక్టర్లు కూడా ఫైనాన్షియల్​ గా ఇబ్బందులు పడ్డారు. జూన్ నెలలో కాస్త కాన్ఫిడెన్స్​ పెరిగింది. ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. ప్రైవేటు ఆసుపత్రులలోనూ చికిత్స మొదలైంది. ఆగస్టులో కాస్త రీసెట్​ అయ్యింది. సెప్టెంబరులో అన్నీ తెరుచుకున్నాయి. అక్టోబరులో పాజిటివ్​కేసుల సంఖ్య తగ్గింది. నవంబరులో 100కి ఒకటి, ఇప్పుడు 300 కి ఒకటి లెక్కన పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. వాక్సిన్ వస్తుందన్న విశ్వాసం కలిగింది. డెత్​ రేట్​ కూడా తగ్గింది. ఇలాంటి కాలాన్ని ఎప్పుడూ చూడలేదు.
–డా.భరత్​కుమార్​, సైకియాట్రిస్టు, కిమ్స్ ఆసుపత్రి

ఆర్గానిక్ ఫుడ్స్ వైపు అడుగులు

మేమంతా బాగున్నాం అని అనుకునే వాళ్లం. కరోనాతో డొల్లతనం బయటపడింది. రోగనిరోధక శక్తి ఎంత అవసరమో తెలిసింది. ఏయే ఆహార పదార్ధాలు తినాలో తెలిసింది. ఎవరికి సాయం చేయాలి? మనకు ఆపదొస్తే ఎవరొస్తారు? మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఇలా చాలా విషయాలు అర్ధమయ్యాయి. సినిమాలు బంద్​. జంక్​ ఫుడ్స్ బంద్. ఖర్చులు తగ్గాయి. సంపాదన తగ్గినా ఉన్నంతలోనే సర్దుకుపోయాం. ఆర్గానిక్ ఫుడ్స్ వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేశారు. మా దగ్గర రెండు నెలల ముందే బెల్లం, పసుపు, కారం వంటి ఉత్పత్తులు అయిపోయాయి. కరోనా సంవత్సరం మన ప్లానింగ్​ను నిర్దేశించింది. ఎలా ఉండాలో చెప్పింది. వ్యాక్సినేషన్ కంటే ఆహార పదార్ధాలతోనే ఆరోగ్యమని గుర్తించాం. ఇంట్లోకి ఎవర్నీ రానివ్వడం లేదు. ఆచితూచి కలుస్తున్నాం. భవిష్యత్తులోనూ ఏయే ఉత్పత్తులకు డిమాండ్​ పెరుగుతుందో అందరూ గుర్తించారు. అందుకే నిరుద్యోగ యువత అటువైపు నడుస్తోంది. యోగా, వ్యాయామం తప్పనిసరి అర్ధం చేసుకున్నారు.

– పగిడిమర్రి చంద్రశేఖర్​, ప్రతినిధి, సేవ్​ ఫౌండేషన్

ఊరే ఆధారమని తేలింది

నేను కరోనా సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఎస్బీఐ జనరల్​ ఇన్సూరెన్స్ లో పని చేసేవాడ్ని. మియాపూర్ లో ఉంటూ సంగారెడ్డి, జహీరాబాద్​ వరకు ప్రయాణం చేసేవాడ్ని. 44 బ్రాంచీలను చూసుకునేవాడ్ని. ట్రావెలింగ్​ చాలా ఇబ్బందిగా మారింది. బస్సులు లేవు. ఎలా వెళ్లాలో తెలియదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఆఫీసులో టార్గెట్లు. ఎక్కడి నుంచి ఎలాంటి ఆపదొస్తుందోనన్న భయం. వర్క్ ఫ్రం హోం చేశా. సక్సెస్ కాలేదు. ఇక లాభం లేదని సొంతూరుకు షిఫ్ట్​ అయ్యాను. గో ఆధారిత ఉత్పత్తులు ఎలా చేయాలో రెండు సార్లు ట్రైనింగ్​ తీసుకున్న. ఉద్యోగానికి రాజీనామా చేశా. ఓ స్టోర్ ను స్థాపించా. ఇప్పుడిప్పుడే గో ఆధారిత ఉత్పత్తులకు ఎంత విలువ ఉంటుందో జనం గుర్తిస్తున్నారు. నా వాళ్లతో కలిసి జీవిస్తున్నా. తక్కువ సంపాదనతోనైనా హాయిగా ఉండొచ్చునని గుర్తించా.

–మహంకాళి జగదీష్, సూర్యాపేట

జాబ్​పోయింది.. షాపు పెట్టేశా

కరోనాకు ముందు వరకు డిగ్రీ లెక్చరర్ గా పని చేశా. కరోనా కాలేజీలను మూసేయించింది. క్లాసులు ఇప్పుడిప్పుడు నడుస్తున్నా అతి తక్కువ మందితోనే. వేలాది మంది లెక్చరర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. నేను నేను ఆర్గానిక్ స్టోర్ ను ఏర్పాటు చేసిన. ఇప్పుడు ఫర్వాలేదు. కుటుంబం గడుస్తుంది. ప్రభుత్వం ఉద్యోగం ఎదురుచూస్తే బతకడం కష్టమవుతుంది. నా తోటి లెక్చరర్లు కూడా చాలా మంది ఊర్లకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లారు. లాక్ డౌన్ లో వాళ్లు పడిన బాధలు వర్ణనాతీతం. మేం కొందరి సాయంతో బియ్యం సేకరించి వాళ్లకు అందించాం. చాలా మందికి బియ్యం పంపిణీ చేసినం. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్లు ఉన్నారు. ఏదో ఒక ఉపాధిని వెతుకున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు.

– భికుమళ్ల సుధీర్, డిగ్రీ కళాశాల లెక్చరర్, చంపాపేట



Next Story

Most Viewed