తాటికల్లు.. డిమాండ్ ఫుల్లు

by  |
తాటికల్లు.. డిమాండ్ ఫుల్లు
X

దిశ, కరీంనగర్: తెల్లవారు జామున ఆరయిందంటే చాలు.. జిల్లాలో వాహనాలు తాటి వనాల వైపు వేగంగా వెళ్తున్నాయి. 2 నుంచి 3 ప్లాస్టిక్ బాటిళ్లు వెంట పెట్టుకుని వాహనదారులు ముందుగా అక్కడికి చేరుకుని, బాటిళ్లలో కల్లు నింపుకుని ఇంటికి వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు అటువైపు కన్నెత్తి చూడని వారంతా ఇప్పుడు నురుగులు చిమ్ముతున్న తెల్లకల్లు కోసం పరుగులు పెడుతున్నారు. చుట్టాలు తప్ప మరొకరి ఫోన్ కాల్ అంటేనే తెలియని గౌడన్నల ఫోన్లు ఇప్పుడు బిజి బిజీ అయిపోయాయి. గౌడన్న మంచి కల్లు ఉందా? ఎన్ని గంటలకు రమ్మంటవ్ అంటూ చేస్తున్న వారికి సమాధానం చెప్పడమే ఓ పెద్ద పనిగా మారిపోయింది గీత కార్మికులకు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కల్లుకు డిమాండ్ పెరిగిందంటున్నారు పలువురు గీత కార్మికులు.

కిటకిటలాడుతున్న తాటి వనాలు..

లాక్ డౌన్ కారణంగా లిక్కర్ దొరకడం లేదు. దీంతో మద్యం తాగాలని ఉవ్విళ్లూరుతున్న వారికి బ్లాక్ మార్కెట్ దందాగాళ్లు చెప్తున్న ధరలతో బైర్లు కమ్ముతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించిన కొందరు ప్రకృతి ప్రసాదించిన కల్లు సేవించేందుకు తాటి వనాల బాట పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం వరకే బయట తిరిగే వెసులు బాటు ఉండటంతో కల్లు కొనుక్కొని ఇళ్లకు చేరిపోతున్నారు. మద్యంతో పోల్చుకుంటే తక్కువ ధరకే కల్లు లభ్యం అవుతుండటం, ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో చాలా మంది ఇప్పుడు కల్లు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు.
డబ్బుకు డబ్బు మిగిలే.. ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుండే అనుకున్న చాలామంది కల్లునే ప్రిఫర్ చేస్తూ మద్యానికి దూరమవుతున్నారు. నల్లబజారులో అడ్డగోలు ధరలకు దొరుకుతున్నఎర్ర మందు కొనడం దండగా అనుకుంటూ సహజసిద్ధమైన కల్లు తాగుతున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తాటి వనాలు తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

పెరిగిన ఆదాయం

లాక్ డౌన్ కారణంగా తాటి కల్లుకు డిమాండ్ రావడంతో గీత కార్మికులకు ఆదాయం కూడా పెరిగిందని చెప్పాలి. గతంలో రోజుకు రూ.300 నుంచి 400 కూడా సంపాదించే వారు నేడు 1,000 నుంచి 1,500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం కొంత తక్కువే ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ కల్లు తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటంతో వారి రోజు వారి ఇన్ కం పెరుగుతోంది. ఆదివారం అయితే మరింత డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్తున్నారు గౌడన్నలు. నిన్నమొన్నటి వరకు గీసిన కల్లు అమ్మడానికి పొద్దంతా వనాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి నుంచి ఇప్పుడు చెట్టు దిగడమే ఆలస్యం అన్నట్టుగా మారిపోయింది. కల్లు బింకీ (కుండ) లతో చెట్టు దిగగానే కల్లు వంపుకుని బాటిళ్లు నింపుకునేందుకు ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే, గీత కార్మికులు మాత్రం అవకాశం అందివచ్చిందని ధరలను పెంచకపోవడం గమనార్హం. గతంలో అమ్మినట్టుగానే లీటరు కల్లు రూ.50 చొప్పునే విక్రయిస్తుండటం వారిలోని నిజాయితీకి నిదర్శనం.

ఆదాయం పెరిగింది..

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన బంద్ జేయబట్టి మాకు రోజువారి ఆదాయం పెరిగింది. అంతకుమునుపు మేం కల్లు అమ్ముకునేందుకు పొద్దంతా ఎదురు చూడాల్సి వచ్చేది. ఒక్కోసారి అమ్ముడుపోని కల్లును పారబోసిన రోజులూ ఉన్నాయి. కాని ఇప్పుడు ఎర్ర మందు దొరుకతలేదని మా దగ్గరికి వచ్చేటోళ్ల సంఖ్య పెరిగింది. దీంతో 1,000 రూపాయల వరకు డబ్బు సంపాదించుకుంటున్నాం. అయితే, ఈ మార్పు లాక్ డౌన్ తర్వాత కూడా ఉంటే మా కుటుంబాలను సాదుకునేందుకు సరిపడా డబ్బు వస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న ఇంకా మా చెరువు గట్టు సమీపంలోని చాలా చెట్ల నుంచి కల్లు తీయడం లేదు. కొద్దిపాటి చెట్ల నుంచి మాత్రమే కల్లు తీస్తున్నాం.– పులి కనకయ్య, గర్రెపల్లి

Tags: palm tree, full demand, covid 19, lock down, corona virus

Next Story

Most Viewed