ప్రైవేట్ ఆస్పత్రుల కక్కుర్తి.. శవాలపై పేలాలేరుకుంటున్న వైనం

by  |
private ambulances
X

దిశ, సూర్యాపేట: ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి, కొందరు ప్రైవేట్ అంబులెన్స్‌ల యజమాన్యాలు శవాల మీద పేలాలు ఎరుకునేలా తయారయ్యారు. కొవిడ్ పేరుతో రోగుల నుండి భారీగా అక్రమ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో రూ. 3 వేలు వసూలు చేసే చోట ప్రస్తుతం రూ.15 వేల నుండి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. అంతగాకుండా.. డ్రైవర్‌కు మరో రూ.వెయ్యి చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో మనిషిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబీకులు, ఆస్పత్రికి డబ్బులు కట్టలేక మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొవిడ్ బారిన పడిన బాధితులు, వారి కుటుంబ సభ్యుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ బాధితుల నుంచి డబ్బు దండుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఆపత్కాలంలో ఒకరికి ఒకరు అండగా ఉండాల్సింది పోయి, ఇదే అదునుగా భావించి, అందినకాడికి సొమ్ము చేసుకొటున్నారు. వైరస్ బారినపడి సరైన వైద్యం అందక, మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారికి ఉన్న ఏకైక అవకాశం ప్రైవేటు అంబులెన్సులే. సాధారణ సమయాల్లో ఉన్న అంబులెన్సు ధరలకు ప్రస్తుత ధరలకు ఏమాత్రం పొంతనే లేదు. సిండికేట్‌గా మారుతున్న ప్రైవేట్ అంబులెన్సుల నిర్వాహకులు.. వాళ్లు చెప్పిన ధరలే వసూళ్లు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అసలు ఏ ఒక్కరూ అంబులెన్సు సౌకర్యం కల్పించకుండా మొండికేస్తున్నారు. పట్టించుకోవాల్సిన యంత్రాంగం, పర్య వేక్షించాల్సిన వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, పాటు మామూళ్ల మత్తులో తూగుతూ హాయిగా నిద్రపోతున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు అంబులెన్సుల దందా ఇష్టారాజ్యంగా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు గాలికి..

ప్రైవేటు అంబులెన్సులపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్‌ అంబులెన్సులకు లైసెన్సులు ఉండాలంటే ఏదో ఒక ఆస్పత్రికి అనుసంధానం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి కనీస అనుభవం ఉండాలి, దాంతోపాటు ప్రాథమిక చికిత్స చేయగలిగేలా సామార్థ్యం కూడా ఉండాలి. రోగికి అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆస్పత్రికి వెళ్లే వరకు ప్రాణాపాయం లేకుండా చూడగలిగే సమర్ధత ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే సమయంలో అదనపు ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. అయితే.. ఈ నిబంధనలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేటు అంబులెన్సులకు సిలిండర్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ఇష్టారాజ్యంగా సిలిండర్లు వినియోగించే అవకాశం లేదు. ఫలితంగా బ్లాక్ మార్కెట్‌లో తీసుకొచ్చామంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. కొన్ని అంబులెన్సులో అదనపు సిలిండర్లు లేక మార్గం మధ్యలోనే రోగులు చనిపోయిన సందర్భాలూ అనేకం చోటు చేసుకుంటున్నాయి.

అంబులెన్సుల అడ్డాగా ప్రభుత్వ ఆస్పత్రులు..

ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అంబులెన్సుల అడ్డాలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 150కి పైగా ప్రైవేటు అంబులెన్సులు ఉన్నాయి. ఈ అంబులెన్సులు సాధారణ రోజుల్లో సూర్యాపేట నుండి ఖమ్మం, హైదరాబాద్‌కు వెళ్లాలంటే గరిష్ఠంగా రూ. 3-4 వేలు తీసుకునే వారు. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఆ ధరలు అమాంతం పెంచి ఏకంగా రూ.15 వేలు చేశారు. గతంలో కిలోమీటర్‌ లెక్కన కమీషన్లు మాట్లాడుకునేవారు. ఇప్పుడు జిల్లా సరిహద్దు రోగులను తరలించే ప్రాంతాలైతే ఒకధర, ఇతర జిల్లాల కైతే మరో ధర వసూలు చేస్తున్నారు. బేటా రూపంలో డ్రైవర్ మరికొంత పిండుకుంటున్నారు. ఇక రాత్రివేళల్లో ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. సూర్యాపేట నగరంలో ఓ ఆస్పత్రి నుండి మరో ఆసుపత్రికి రోగిని తరలించాలంటే బంధువులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే వీరి దోపిడీకి కొంతైనా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొందరు అధికారులు, మామూళ్లకు అలవాటు పడి ఆ శాఖ పరువు తీయడమే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్ రాబందు..

కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు చేసేందుకు కూడా ముడుపులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో నెలకొందని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలెంల డంపింగ్ యార్డుకు తరలించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే లంచం ఇవ్వాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. నిర్వాహకులపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జిల్లాలో అక్రమాలకు, అవినీతి తావులేకుండా చూడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed