లాక్‌డౌన్ ఏమో కానీ.. పస్తులు ఉంటున్నాం..

by  |
లాక్‌డౌన్ ఏమో కానీ.. పస్తులు ఉంటున్నాం..
X

దిశ. బేగంపేట : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా బడుగు జీవులు ఆకలి కేకలతో పస్తులు ఉండాల్సి వస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, పాస్ పోర్టు కార్యాలయం, ప్యాట్ని, గార్డెన్ హోటల్, ప్యారడైజ్ హోటల్, తదితర ప్రాంతాల్లో ఏ దిక్కు లేని అనాధలు, భిక్షాటన చేసేవారు, ఫుట్‌పాత్‌పై నివసించేవారిని వందలాది మంది నిత్యం మనం చూస్తూ ఉంటాం.

కానీ, ఈ ప్రాంతంలో నివసించే వారిది ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దీన కథగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కోల్పోయిన వారు కొందరైతే ఉపాధి లేక మరికొందరు రోడ్లపై గత కొన్ని సంవత్సరాల నుండి జీవితం కాలం వెళ్లదీస్తూ.. పబ్బం గడుపుతున్నారు. ఈ ప్రాంతంలో మధ్యాహ్న సమయంలో అన్నపూర్ణ పథకం కింద ఐదు రూపాయలకే భోజనాన్ని క్లాక్ టవర్ సమీపంలో నిత్యం అందిస్తుంటారు. 5 రూపాయల భోజనం కొందరికి అందితే మరికొందరు హోటళ్లలో పనిచేస్తూ బుక్కెడు బువ్వ కోసం రోజంతా శ్రమ పడుతుంటారు. రెండు పూటల అన్నం కోసం పడరాని పాట్లు పడుతుంటారు.

ఈ సమయంలో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్న బడుగు జీవుల ఆకలి కేకలు మళ్లీ మొదలయ్యాయి. లాక్‌డౌన్ ప్రారంభమైన బుధవారం 5 రూపాయల భోజనం కోసం బడుగు జీవులు కొట్టుకున్నారు. సాయంత్రం వేళ ఈ ప్రాంతంలో నివసించే వారికి వివిధ స్వచ్ఛంద సంస్థలు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. కానీ స్వచ్ఛంద సంస్థలకు లాక్‌డాన్ అడ్డుపడడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఈ ప్రాంతంలో బుక్కెడు బువ్వ కోసం బడుగు జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మమ్మల్ని పట్టించుకోరా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బుధవారం పలువురుని ‘దిశ’ రిపోర్టర్ పలకరించగా తన ఆవేదనను తెలియజేశారు.

Next Story

Most Viewed