11 సార్లు పోలీసుల్ని బెంబేలెత్తించిన గాన గంధర్వ కోకిల

by  |
11 సార్లు పోలీసుల్ని బెంబేలెత్తించిన గాన గంధర్వ కోకిల
X

దిశ, వెబ్ డెస్క్ : ఆమె గాన గంధర్వ కోకిల. గొంతు సవరించుకొని పాటపడిందంటే ఆమె వాయిస్ కు ఎంతటి వారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. కానీ విధి వక్రించింది. 11 సార్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. అయినా బుద్ధి మారలేదు. వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది.

వెస్ట్ బెంగాల్ కోల్ కత్తాకు చెందిన మున్ సేన్ అలియాస్ అర్చన దంపతులు హైదరాబాద్ లో నివాసం ఉంటుంన్నారు. అర్చన మంచి గాయని. ఆర్కెస్ట్రాలో సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమె భర్త బిజినెస్ మేన్. ఓ వైపు సింగర్‌గా రాణిస్తుంటే.. భర్త వ్యాపారంలో లాభాల్ని గడిస్తున్నాడు. అంతా బాగుందనుకున్న సమయంలో అనుకోని కుదుపు ఆమె జీవితాన్ని తల్లకిందలు చేసింది. భర్త చేస్తున్న వ్యాపారం దెబ్బతింది. దీనికి తోడు సింగర్‌గా తన హవా కొనసాగుతున్న సమయంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడింది. దీంతో ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయి.

ఆ కష్టాలనుంచి బయటపడేందుకు అర్చన తన భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి కోల్ కత్తాకు షిఫ్ట్ అయ్యింది. సమస్యల నుంచి గట్టేక్కేందుకు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించింది.చివరకు విఫలమైంది. ఓవైపు ఆర్ధిక ఇబ్బందులు. మరోవైపు జల్సాలు. అదే సమయంలో భర్త నుంచి విడాకులు.

తట్టుకోలేక చివరకు పొట్టకూటి కోసం సింగర్ నుంచి దొంగగా మారింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్ కతా నగరాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసుల్ని బెంబేలెత్తించింది. ఖరీదైన షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే మార్కెట్లలో పట్టపగలే దర్జాగా దొంగతనాలు చేస్తూ తన అవసరాల్ని తీర్చుకుంది.

అయితే అర్చన పాపం పండింది. 2019లో ముంబై లోయర్ పారెల్ ప్రాంతంలో ఓ మహిళ నుంచి బ్యాగ్ దొంగతనం చేసింది. ఆ బ్యాగ్ లో డబ్బులు, నగలు కలిపి 15లక్షల విలువైన వస్తువులున్నాయి. దీంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు టేకప్ చేయడంతో అర్చన కథ అడ్డం తిరిగింది. పోలీసులకు దొరికిపోయింది. ఆమెపై నమోదైన కేసుల గురించి తెలుసుకున్న పోలీసులు కంగు తిన్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 11సార్లు పోలీసులకు పట్టుబడినట్లు గుర్తించారు. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో చివరకు కటకటాల్లోకి నెట్టారు.

ఈ సందర్భంగా క్రైమ్ బ్రాంచ్ ఎస్సై యోగేష్ చౌహాన్ మాట్లాడుతూ అర్చన కోసం రెండేళ్ల నుంచి వెతుకుతున్నాం. నిందితురాలు 2018 దాదార్ ప్రాంతానికి చెందిన ఓ షాపింగ్ మాల్ లో దొంగతనం చేసింది. 2019లో లోయర్ పారెల్ ప్రాంతంలో ఓ మహిళ నుంచి బ్యాగ్ ను దొంగిలించింది. 2018, 2019 లో చేసిన దొంగతనాలు ఒకే విధంగా ఉండడంతో అర్చనే నిందితురాలని గుర్తించాం. ఆమెకోసం గాలింపు చర్యలు చేపట్టి చివరకు పట్టుకున్నామని ఎస్సై యోగేష్ చౌహాన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే దొంగతనం చేసిన విలువైన వస్తువులు, బంగారం, డబ్బులు అన్నీ రికవరీ చేసుకున్నామన్న ఆయన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని చెప్పారు.

Next Story

Most Viewed