ఆన్‌లైన్ తరగతులకు ఫీజులతో ముడిపెట్టొద్దు

by  |
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు దూరంగా పెట్టడం చదువుకునే హక్కును కాలరాయడమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులు కట్టనంత మాత్రాన వారిని తరగతులకు అనుమతించకపోవడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో మానవీణ కోణం నుంచి ఆలోచించి ఫీజులు కట్టకపోయినా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు అనుమతి కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు యాజమాన్యం ఒత్తిడిపై యాక్టివ్ పేరెంట్స్ ఫోరం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరంట్స్ ఫోరం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌లో, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తున్నదని పేర్కొన్నది. ఫీజులు చెల్లించనందుకు 219 మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు బోధించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్కూలు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని విద్యార్థులకు నిర్దేశించిన ఫీజులో పది శాతాన్ని పెంచాలని అనుకున్నా, కరోనాను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు. పైగా గతేడాది వసూలు చేసిన ఫీజునే కొనసాగిస్తూ అందులో రూ.10 వేలు తగ్గించామని హైకోర్టుకు వివరించారు.

హైకోర్టు బెంచ్ జోక్యం చేసుకుని, ఫీజులో ఎంత శాతం తగ్గించారో తెలపాలని ఆదేశించింది. ఫీజు కట్టలేదనే కారణంతో ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులను అనుమతించకపోవడం వారి చదువుకునే హక్కును కాలరాయడమే అవుతుందని స్పష్టం చేసింది. లాభాపేక్ష లేని సొసైటీ కూడా కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. ఫీజుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని నొక్కిచెప్పింది. ఇప్పటివరకు ఎంతమంది ఏ స్థాయిలో ఫీజులు చెల్లించలేదో, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉన్నదో వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.



Next Story

Most Viewed