ఆర్థిక భారంగా ఆన్‌లైన్ క్లాసులు.. విద్యార్థులకు కొత్త తలనొప్పి

by  |
Online Classes
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోంది. హోంవర్క్, ఫిజికల్ కాపీలను కొనుగోలు చేసేందుకు అదునపు ఖర్చులవుతున్నాయి. ప్రింట్లు తీసుకోడానికి ఇంటర్నెట్ సెంటర్లకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా ప్రవేశపెడుతున్న విధానాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫిజికల్ కాపీలిస్తామని చెప్పిన విద్యాశాఖ అధికారులు మాట మార్చడంతో తల్లిదండ్రులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతులు విద్యార్థులను తల్లిదండ్రులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నెల 1నుంచి ప్రారంభమైన ఆన్ లైన్ తరగుతుల ద్వారా ప్రభుత్వం గతేడాది పాఠాలను విద్యార్థులను పునరావృతం చేసేందుకు బ్రిడ్జ్ కోర్స్‌ను ప్రవేశపెట్టింది. దూరదర్శన్, టీ సాట్ ద్వారా తరగతుల వారిగా షెడ్యూల్ ప్రకారం పాఠాలను బోధిస్తున్నారు. ఒక పాఠం పూర్తయిన తరువాత ఆ పాఠ్యంశంపై విద్యార్థులకు హోం వర్క్ అందిస్తున్నారు. ప్రశ్నల జాబితాను వాట్సప్ ద్వారా అందించి, వాటికి జవాబులు రాసి ఆన్ లైన్‌లోనే ఉపాధ్యాయులకు అందించాలని సూచిస్తున్నారు.

హోంవర్క్ ఫిజికల్ కాపీలకు అదనపు ఖర్చు

ప్రతి రెండు, మూడు రోజులకు ఒక పాఠ్యాంశాన్ని పూర్తి చేస్తున్న అధికారులు వీటికి సంబంధించిన హోం వర్క్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. ఉపాధ్యాయులు సూచించిన విధానం ప్రకారం హోంవర్క్ ప్రశ్నాపత్రాలను ప్రింట్ తీసుకొని వాటికి జవాబులు రాసి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు తరచూ ఇంటర్ నెట్ సెంటర్‌కు వెళ్లి హోం వర్క్ ఫిజకల్ కాపీలను కోనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక్కో పాఠ్యాంశానికి రూ.15 నుంచి రూ.20లను ఖర్చు చేసి హోంవర్క్‌ను పూర్తి చేసి ఉపాధ్యాయులకు అందించాల్సి వస్తుంది.

ఫిజికల్ కాపీలిస్తామని మాట మార్చిన అధికారులు

హోం వర్క్‌ను విద్యార్థులకు సూచిస్తున్న మొదటల్లో ప్రభుత్వం త్వరలోనే హోం వర్క్ ఫిజికల్ కాపీలను అందిస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి కాపీలు సరఫరా అయ్యేంత వరకు సొంతంగా కొనుగోలు చేసి హోం వర్క్ పూర్తి చేయాలని సూచించారు. తరగతులు ప్రాంభించి18 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఫిజకల్ కాపీలను అందించడం లేదు. కేవలం పాఠ్యపుస్తకాలను మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రతిసారి హోం వర్క్ కాపీలను కొనుగోలు చేయలేని విద్యార్థులు హోం వర్క్ చేయడాన్ని పూర్తిగా మానేస్తున్నారు. ఫిజికల్ కాపీలు అందించే విషయంలో అధికారులు మాట మార్చడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు స్కూళ్లకు ముందుచూపు కరువు

ఆన్ లైన్ తరగతుల నిర్వహణ అంశంపై ప్రభుత్వం మొదటి నుంచి స్పష్టతలేని విధానాలను ఆచరిస్తోంది. దీంతో ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆన్ లైన్ తరగతులను నిర్వహించడంలో ఎదరుయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. విద్యార్థులకు కావల్సిన మౌళిక సదుపాయాలను కల్పించడం, టీవీలు అందుబాటులో లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం ద్వారా విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు దూరమవుతున్నారు.



Next Story

Most Viewed