జోరుగా ‘బిగ్‌బాష్’ బెట్టింగ్

by  |
జోరుగా ‘బిగ్‌బాష్’ బెట్టింగ్
X

దిశ, మెదక్: క్రీడలంటే.. ఒకప్పుడు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ప్రతీక. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కార్పొరేట్ ప్రపంచంలో ప్రతీదీ బిజినెస్సే. క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్‌. ఈ ఆట కాలక్రమేణా కమర్షియల్‌గా మారింది. ఫార్మాట్ ఏదైనా దాని లక్ష్యం మాత్రం ఒక్కటే. డబ్బు డబ్బు. తాజాగా బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ బెట్టింగుల్లో మునిగి తేలుతున్న వారు లక్షల్లో డబ్బులు పందేలు కాస్తున్నారు. ఓవర్ నైట్‌లో డబ్బులు సంపాదించాలన్న ఆతృత ఒకరిదైతే, మ్యాచ్ పోయి జేబులు గుల్ల చేసుకుని లబోదిబోమంటున్న వారు మరికొందరు.

కోట్లలో పందేలు..

ఇటీవల ఆస్ట్రేలియా దేశంలో మొదలైన బిగ్ బాష్ క్రికెట్ మాయలో అనేక మంది బలి పశువులుగా మారుతున్నారు. మొత్తం సెల్ ఫోన్లోనే అయిపోయే ఈ తతంగాన్ని బూకీలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. డిసెంబర్ 10న మొదలైన ఈ ఆట ఫిబ్రవరి 6న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నెలన్నర రోజుల్లోనే కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. వేసే ప్రతీ బాల్‌కు ఇంత అంటూ పందెంరాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, మనోహరాబాద్, చేగుంట, వెల్దుర్తి తదితర మండలాల్లో రహస్యంగా బెట్టింగులు నడుస్తున్నట్టు తెలుస్తున్నది. వ్యాపారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, టీచర్లు, యువకులు ఇలా ఒకరేమిటీ అంతా బిగ్ బాష్ షో ముందు తలవంచిన వారే.

రహస్యంగా ఏర్పాట్లు..

ఈ బెట్టింగ్‌ల్లో లక్షల్లో డబ్బులు పోగేసుకున్న వారు కొందరైతే అప్పులు చేసి ఆటలో ఓడి జేబులు గుల్ల చేసుకునే బాధితులు మరికొందరు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బూకీలు రహస్యంగా వీటి ఏర్పాట్లను ఓ కంట కనిపెడుతున్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలో ఓ పేరు మోసిన మొబైల్ షాపు నిర్వాహకుడు బిగ్ బాష్ గేమ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తున్నది. నిర్వాహకుల ఒత్తిడితో ఏకంగా పట్టణం నుంచి పలాయనం చిత్తగించినట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో వీరి ఆగడాలకు బలై మోసపోయిన మరో వ్యక్తి తన సర్వస్వాన్ని వదలి జిల్లాలోని ఓ మండలంలో మెడికల్ షాపు పెట్టుకుని బతుకు బండి నడిపిస్తున్నట్టు సమాచారం. ఒక్కో మ్యాచ్‌కు పదివేలకు వెయ్యి లక్షకు పదివేల కమీషన్లు తీసుకుని తతంగం నడిపిస్తున్నట్టు సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు చేసినా..

జిల్లాలో యథేచ్ఛగా బిగ్ బాష్ బెట్టింగులు నడుస్తున్నా.. వీటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవలే సర్వస్వాన్ని పోగొట్టుకున్న ఓ బాధితుడు చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐనా చేస్తాం చూస్తాం అని కాలయాపన చేస్తున్నారని ఓ బాధితులు వాపోయాడు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు కట్టకపోతే బుకీలు బాధితులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పోలీసుల దగ్గరికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని ఓ వర్గానికి చెందిన వారు ఈ బెట్టింగులు, కోడి పందేలు, మట్కా, జూదం లాంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినా, సంబంధిత పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే బాధితుల దగ్గర నుంచి చెక్కులు తీసుకుని అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం.

ఫైనల్ మ్యాచ్‌కి వెయింటింగ్..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ బిగ్ బాష్ క్రికెట్ టోర్నీలో ప్రధానంగా ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్ మ్యాచ్ ఏర్పాట్ల కోసం ఇప్పటి నుంచే నిర్వాహకులు బూకీలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ లు మొత్తం ఆన్‌లైన్ మొబైల్ ఫోన్లలోనే జరుగుతుండటంతో గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. వీరిని గుర్తించేందుకు జిల్లాలో నిఘా టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ఈ బెట్టింగులపై నిఘా ఉంచి, వీటిని నిర్వహిస్తున్న బూకీలు నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

నిఘా ఉంచాం..

జిల్లాలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న క్రికెట్ పందేలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాం. ఫోన్‌లోనే ఈ తతంగమంతా జరుగుతుండటంతో నిర్వాహకులను గుర్తించడం కొంత ఆలస్యం అవుతున్నది. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎవరైనా నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులను ఆశ్రయి స్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– కృష్ణమూర్తి, డీఎస్పీ

Next Story

Most Viewed