దేశాన్ని కదిలించిన 'దిశ' ఘటనకు ఏడాది

by  |
దేశాన్ని కదిలించిన దిశ ఘటనకు ఏడాది
X

దిశ, వెబ్ డెస్క్: నవంబర్ 27, 2019.. రాత్రి.. హైదరాబాద్ శివారు.. శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా.. నాలుగు మృగాల దుశ్చర్యకు సాక్ష్యంగా నిలిచింది. ఓ అమాయకురాలి ఆక్రందనను మౌనంగానే వింటూ ఉండిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యను కళ్లారా చూస్తూనే సమాధానం ఇవ్వలేకపోయింది. దేశం ఉలిక్కిపడేలా చేసిన దిశ హత్యాచారం ఘటనకు నేటితో ఏడాది అయ్యింది. దీనిపై దిశ అందిస్తోన్న స్పెషల్ స్టోరీ.

26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ దిశ.. ప్రతి రోజూ స్కూటీపై రావడం తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో పార్క్ చేయడం.. అక్కడినుంచి క్యాబ్ లో గచ్చిబౌలి వెటర్నరీ హాస్పిటల్ కి వెళ్లి రావడం.. మళ్లీ అదే స్కూటీ పై ఇంటికి వెళ్ళడం… సమాజం, కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యతలేని నలుగురు దుర్మార్గులు మొహమ్మద్ అరిఫ్, చెన్నకేశవులు, జె శివ, జె నవీన్ నిశితంగా గమనించేవారు. ఆమె రాకకై కాచుకుని మరీ ఎటాక్ చేశారు ఆ నలుగురు మృగాళ్లు. నవంబర్ 27 రాత్రి తొమ్మిదిగంటల సమయంలో.. దిశ స్కూటీని పంక్చర్ చేసి.. హెల్ప్ చేస్తున్నట్లు నాటకం ఆడి.. పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేసి.. ట్రక్ లోనే తిప్పుతూ.. ఆమెకు బలవంతంగా మద్యం తాగిస్తూ… ఒకరి తర్వాత మరొకరుగా రేప్ చేశారు. అంతటితో ఆగలేదు, షాద్ నగర్ సమీపంలో హైదరాబాద్ – బెంగళూరు హైవే పక్కన దిశపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు.

తర్వాత రోజు ఉదయం

ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్రం, దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు స్థానికులు. దిశకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు ఉదృతం చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో దిశ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. పోలీసులు ఒక్క రోజులోనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ నలుగురే హత్య చేసినట్టు ఆధారాలు సేకరించి కోర్టు ముందు హాజరు పరిచారు. సీన్ రిక్రియేషన్ కోసం కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు… దిశ మర్డర్ స్పాట్ కు వెళ్లారు.

కాగా డిసెంబర్ 6న సీన్ రీక్రియేట్ చేస్తుండగా… తప్పించుకునే ప్రయత్నం చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. ఆరోజు దేశం మొత్తం ‘దిశ’కు పరోక్షంగా న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. గొప్ప పని చేశారు అంటూ 100 నంబర్ కు కాల్ చేసి ధన్యవాదాలు చెప్పారు. సజ్జానార్ ను హీరోను చేశారు. అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హై కోర్టులో పిల్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించాల్సి వచ్చింది. ఫైనల్ గా సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ పానెల్ ను నియమించింది. అయితే ఇంక్వైరీ ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది.

సినిమా వస్తువుగా దిశ..

దిశ హత్య కేసులో పోలీసులు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపినా సరే.. దేశంలో కాదు కదా కనీసం రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారం, హత్య లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నాయా అంటే లేదు. మూడు నెలల ఆడ శిశువు మొదలుకుని.. కాటికి కాళ్ళు చాచిన ముసలి అవ్వ వరకు ఇంకా ఈ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఇలాంటి ఘటనలు వక్రబుద్ధి ఉన్న మగ మృగాల్లో, కామంతో కళ్లు మూసుకుపోయిన బుద్ధి హీనుల్లో కనువిప్పు కలిగించాలి కానీ అలా జరగలేదు. కేవలం సినిమాలో కథా వస్తువుగా మాత్రమే మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ దిశ కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. దీన్ని ఆపేందుకు బాధిత కుటుంబీకులు నిరసనలు చేస్తున్నారు. దిశ హత్య కేసు కూడా ఒక సినిమా స్టోరీగా మిగిలిపోయింది తప్ప.. ఈ కేసు ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు విశ్లేషకులు.

Next Story

Most Viewed