25న నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్?

by  |
25న నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ పర్యటన ఖరారైతే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంశాలపై సమీక్ష ఉంటుందని, కనుక జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు వివిధ పనుల పురోగతికి సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రభుత్వ పాలసీలపై చీఫ్ సెక్రెటరీ నిర్వహించిన సమీక్షలో మున్సిపాలిటీలు తమ రెగ్యూలర్ విధులు, పెండింగ్ పనులతో పాటు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికనుగుణంగా చేపట్టిన, చేపట్టబోయే పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలని, హరితహారం కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీల్లో ప్రతి 5 వార్డులకు ఒకటి చొప్పున నర్సరీలు , ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలు పెంచేలా ఏర్పాటుచేయాలని, ప్రతి రోడ్డులో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 మీటర్ల కంటే ఎత్తయిన మొక్కలు నాటాలని, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని సూచించారు. శనివారంలోపు పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. ప్రజా టాయిలెట్లు పూర్తి చేసి ఆగస్ట్ 15న ప్రారంభించేలా సిద్ధం చేయాలన్నారు. విలీన గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ, తాగునీరు తదితర అంశాలపై, కరోనా కట్టడికై తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

టీఆర్ఎస్ భవన్ ప్రారంభం కోసమే..

హైద్రాబాద్ తర్వాత జిల్లా కేంద్రాల్లో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో కేవలం నిజామాబాద్‌లోనే తెలంగాణ భవన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గతేడాది దసరా పండగ నాడు తెలంగాణ భవన్ నిర్మాణానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కెనాల్ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన 3800 గజాల స్థలంలో భవన నిర్మాణ పనులు పూర్తికావడంతో ఈ నెల 25న దాని ప్రారంభానికి సీఎం కేసీఆర్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.



Next Story

Most Viewed