కేటీఆర్ మాటను లెక్క చేయని అధికారులు.. మహిళకు న్యాయం జరిగేనా.?

by  |
KTR
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, సిరిసిల్ల : సరిగ్గా రెండేళ్ల క్రితం ఆ అభాగ్యురాలి భర్త చనిపోయాడు. ఇంటి యజమాని వెళ్లగొట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో తల దాచుకుంది. తన సంతానంతో పాటు పెట్టే బేడా సర్దుకుని ఉన్న ఆ మహిళ దీనస్థితిని గమనించిన స్థానికులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్థానిక కౌన్సిలర్లకు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పాలని, అవి పూర్తయ్యే వరకూ నిలువ నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన కౌన్సిలర్లు, మంత్రి కేటీఆర్ పీఏ హుటాహుటిన ఆమెకు భరోసా కల్పించారు. అయితే, ఆదివారం ప్రారంభం కానున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితాలో ఆమెకు మాత్రం ఇల్లు మంజూరు కాలేదు. దీంతో, ఆమె కేటీఆర్ క్యాంప్ ఆఫీసు వద్దకు వెళ్లి తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే ఆమెకు డబుల్ ఇళ్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన వేముల కవిత భర్త సదానందం రెండేళ్ల క్రితం చనిపోయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో తల దాచుకున్నప్పుడు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరకపోవడంతో మంత్రి కేటీఆర్‌ను కలిసి తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన కేటీఆర్ ఆమెకు న్యాయం చేయాలని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఇప్పుడైనా నెరవేరేనా.?

రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఒక్క ఇళ్లు కూడా ఆమెకు కేటాయించకపోవడం విస్మయం కల్గిస్తోంది. మళ్లీ ఆమె తన పరిస్థితి చెప్పుకునేందుకు మంత్రిని కలిసిన తరువాత అయినా ఆమెకు డబుల్ ఇళ్లు మంజూరు అవుతుందా అన్నదే సిరిసిల్లలో జరుగుతున్న చర్చ. నిలువ నీడ లేక, తోడుగా ఉండాల్సిన భర్త కానరాని లోకాలకు వెళ్లిపోగా సంతానాన్ని పెంచి పోషించలేక పోతున్న ఆమెకు బాసటగా నిలిచేందుకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

మంత్రికి గుర్తు చేయాల్సిందెవరూ..?

రెండేళ్ల క్రితం ఓ అభాగ్యురాలికి అండగా ఉంటామని ఇచ్చిన హామీ గురించి మంత్రి కేటీఆర్‌కు గుర్తు చేస్తే.. ఆమె మళ్లీ వచ్చి అభ్యర్థించే పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు స్థానికులు. డబుల్ ఇళ్ల కేటాయింపు జాబితా తయారు చేసేప్పుడే వేముల కవిత ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి, ఆమెకు ఇచ్చిన మాట గురించి చెప్తే బావుండేదని అంటున్నారు స్థానికులు. రెండో సారి మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెకు భరోసా ఇచ్చినందున సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షిద్దాం.


Next Story