కమిషనర్ బదిలీకి ఆటంకం.. నారాజ్‌లో కార్పొరేటర్లు!

by  |
కమిషనర్ బదిలీకి ఆటంకం.. నారాజ్‌లో కార్పొరేటర్లు!
X

దిశ, హుజురాబాద్: ఆ ఒక్క అధికారి గురించి అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా ఏకమయ్యారు. సమావేశాన్నే బహిష్కరించి సంచలనం సృష్టించారు. ఈ విషయం అమాత్యుడి వరకూ చేరింది. ఆయన కూడా వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేయించారు. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ జోనా వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30న జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. చైర్మన్ మినహా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా బైకాట్ చేయడంతో సంచలనం కలిగించింది. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి వెళ్లడంతో మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేయిస్తూ ఆదేశాలు జారీ చేయించారు. హుజురాబాద్ కమిషనర్ జోనాను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పాల్వంచకు.. అక్కడ పనిచేస్తున్న శ్రీకాంత్‌ను హుజురాబాద్‌కు బదిలీ చేశారు. దీంతో తమ లక్ష్యం నెరవేరిందని కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బదిలీకి ఆటంకం!

కమిషనర్ బదిలీ కావడంతో తమ గోల్ రీచ్ అయ్యామని భావించారు. అనూహ్యంగా కమిషనర్ బదిలీకి మరో ఆటంకం ఎదురైంది. పాల్వంచ కమిషనర్ శ్రీకాంత్‌ను రిలీవ్ చేయవద్దని అక్కడి ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. దీంతో జోనా హుజురాబాద్ నుంచి రిలీవ్ కాలేకపోయారు. తామింత కష్టపడి కమిషనర్‌ను బదిలీ చేయించడంలో సఫలం అయితే ఆయన స్థానంలో నియమించిన కమిషనర్‌ను అక్కడి ప్రజాప్రతినిధులు పంపించేందుకు ససేమిరా అనడంతో పాత కమిషనర్‌తోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందేమోనన్న ఆవేదన వ్యక్తం అవుతోంది ఇక్కడి కౌన్సిలర్లలో.. కమిషనర్‌ను బదిలీ చేయించడంలో తమ వ్యూహం ఫలించిందనుకున్నా చివరి నిమషంలో ఇలా జరిగిందేంటీ అనుకుంటున్నారని తెలుస్తోంది.

Next Story

Most Viewed