కేబుల్ టీవీ ద్వారా ఇంటర్నెట్ సేవలు!

by  |
కేబుల్ టీవీ ద్వారా ఇంటర్నెట్ సేవలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేబుల్ టీవీ వినియోగదారులకు ప్రయోజనాలను అందించే విధంగా త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కేబుల్ టీవీ లైన్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించడానికి కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే అవసరమైన నిబంధనలను సైతం రూపొందించింది. త్వరలో దీనికి ఆమోదం లభించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తదనుగుణమైన నిబంధనలను రూపొందించింది. ఈ వారంలో డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఈ అంశమే ప్రధాన అంశమని తెలుస్తోంది. కరోనా వల్ల చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా, ప్రయోజనాలు కల్పించేలా నిబంధనలు ఉండనున్నాయి. ఇక, లాక్‌డౌన్ కాలంలో బ్రాడ్‌బాండ్ కనెక్షన్స్‌కు డిమాండ్ భారీగా 50 శాతం వరకూ పెరిగాయి. దేశవ్యాప్తంగా 12 కోట్ల ఇళ్లకు కేబుల్ టీవీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ లైన్‌ల ద్వారా బ్రాండ్‌బాండ్ సేవలను అందిస్తే చాలామందికి ప్రయోజనాలుంటాయి. కేంద్రం, మరో 2 నెలల్లోగా కొత్త నిబంధనలను జారీ చేయనుంది. ఇదే క్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్లు, ట్రాయ్, టెలికాం విభాగాలకు చెందిన వారి నుంచి సూచనలు, సలహాలను సేకరించనుంది. ఏజీఆర్, లైసెన్స్ ఫీజుల వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ నిర్ణయం విజయవంతమైతే సుమారు 10 కోట్ల మందికి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఆపరేటర్లు మాత్రం మౌలిక సదుపాయాలపై అదనపు ఖర్చులను భరించాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed