చారిత్రాత్మక ఆస్పత్రిలో సిబ్బంది లేక ఇబ్బంది

by  |
చారిత్రాత్మక ఆస్పత్రిలో సిబ్బంది లేక ఇబ్బంది
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత రోగుల పాలిట శాపంగా మారుతున్నది. సర్కారు దవాఖానాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాటలు నీటిమూటలుగానే కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన అనంతరం కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. కరోనా వైరస్​మొదలైన నాటి నుంచి ఆస్పత్రిలో సమస్యలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి 1168 పడకల సామర్థ్యం ఉండగా రోగులు రెట్టింపు సంఖ్యలో వస్తుంటారు. వైద్యులు, సిబ్బంది కొరతతో వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందిలో ప్రతిభకు కొరత లేనప్పటికీ అన్ని విభాగాల్లో సిబ్బంది అవసరాల మేరకు లేకపోవడం పని చేస్తున్న వారిపై అదనపు భారం పడుతోంది. కరోనా ప్రభావం చూపడం మొదలైన నాటి నుంచి ఇది మరింత పెరిగింది.

ఏప్రిల్ నుంచి కరోనా సేవలు..

ఉస్మానియాలో ఏప్రిల్ నెల నుంచి కరోనా వైద్య సేవలు మొదలయ్యాయి. గాంధీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి కొవిడ్ వైద్యం అందుతుండగా ఉస్మానియాలో మాత్రం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఓపీ భవనం రెండో అంతస్తులో 105 ఐసొలేషన్ పడకలతో కరోనా వార్డును ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలతో ఇక్కడికి వచ్చే వారిని పరీక్షించి కరోనా పాజిటివ్ అని తేలితే తదుపరి వైద్యం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇలా ప్రతినిత్యం సుమారు 30 వరకు కరోనా పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదవుతుండగా కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారు రిపోర్టులు రాకముందే చనిపోతున్నారు. ఇలా ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో కలిపి నెలకు సగటున 180 మంది రోగులు మృత్యువాత పడుతున్నారు.

సిబ్బంది లేక ఇబ్బంది

ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, మినిస్టీరియల్ స్టాఫ్, థియేటర్ అసిస్టెంట్స్, పారా మెడికల్, నాల్గొ తరగతి సిబ్బంది కొరత ఉంది. ఇటీవల ప్రభుత్వం ఔట్ సోర్సిగ్ పద్ధతిని కొంత మంది నర్సింగ్, నాల్గో తరగతి సిబ్బందిని నియమించినా ఇంకా కొరత ఉండడం గమనార్హం.



Next Story

Most Viewed