ఆఫీసులకు సెలవులు బంద్.. ఎందుకో తెలుసా..?

by  |
ఆఫీసులకు సెలవులు బంద్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ధిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్త ప్లాన్ వేసింది. మార్చి నెలంతా సెలవు రోజుల్లోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టనుంది. ఆదివారాలు, రెండో శనివారం కూడా పని చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ వి.శేషాద్రి ఈరోజు సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలను సెలవు రోజుల్లోనూ తెరిచి ఉంచాలని, ఉద్యోగులు అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలను తప్పక పాటించాలని సర్క్యులర్​లో పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరానికి మరో 26 రోజులే మిగిలి ఉండడంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు గులాబీ సర్కార్ తగు ప్రణాళికలకు రచిస్తున్నది. జనవరి నుంచి పుంజుకుంటున్న ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల మీద మాత్రమే ఆదాయం చేకూరింది.

అదే విధంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ఫీజుల కింద మరింతగా ఆదాయం సమకూర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ధరణి పోర్టల్​లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు వంటి అంశాలను తెర మీదికి తీసుకురావడం, ఎల్ఆర్ఎస్‌ను తప్పనిసరి చేసింది. ఈ కారణంగా నాలుగు నెలలకు పైగానే భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు తీరని నష్టం వాటిల్లింది. ఇప్పుడేమో ఆదాయాన్ని సమకూర్చునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ కేవలం 26 రోజుల్లో ఏ మేరకు సాధించగలరో వేచి చూడాల్సిందే.

శభాష్​.. చీఫ్ సెక్రటరీ

రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న స్టాంప్స్ అండ్ ​రిజిస్ట్రేషన్ల శాఖ బాగా పని చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​కుమార్ ​ప్రశంసించారు. ఈరోజు రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగ సంఘం నాయకులు సీఎస్‌ను కలిశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని కొనియాడారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తామని, శాఖను రీ ఆర్గనైజ్ చేస్తామని అన్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్​ను కలిసిన వారిలో టీజీఓ సెంట్రల్​కమిటీ అసోసియేట్​ప్రెసిడెంట్ ​సామల సహదేవ్, టీజీఓ ఆర్గనైజింగ్​సెక్రటరీ జేహెచ్​ ప్రణయ్​కుమార్, టీఎన్జీఓ హైదరాబాద్ ​జిల్లా అధ్యక్షుడు ముజీబ్, స్టాంప్స్​ అండ్ ​రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, నాయకుడు నరేష్​లు ఉన్నారు.


Next Story

Most Viewed