పంచాయతీలగోడు.. ప్రభుత్వానికి పట్టదా..

by  |
పంచాయతీలగోడు.. ప్రభుత్వానికి పట్టదా..
X

దిశ, మహబూబాబాద్ : పల్లెల అభివృద్దే తెలంగాణ సర్కార్ ధ్యేయమని చెబుతున్న పాలకులు గ్రామ పంచాయితీ లకు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. 2020-2021 ఆర్ధిక సంవత్సరం పూర్తయినప్పటికీ స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ సర్పంచులు ఆర్ధిక భారంతో మగ్గుతున్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి నెలల వారిగా రావాల్సిన రాష్ట్ర నిధులు గత ఏడాది నుండి ప్రభుత్వం నిలిపివేయడంతో సర్పంచ్ లు నిధుల లేమి తో తర్జనభర్జనలు పడుతున్నారు. కేవలం 15వ ఆర్ధిక సంఘం నిధుల తో మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ నిర్వహణ, సిబ్బంది వేతనాలు సైతం ఇవే నిధులు వాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

గ్రామ పంచాయితీ నిధులు తక్కవగా ఉండడంతో గ్రామ స్థాయిలో ఆశించిన రీతిలో అభివృద్ధి జరగడం లేదు.లక్షల రూపాయలతో సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు చేసిన సకాలంలో బిల్లులు రాక అప్పు తెచ్చి చేసిన డబ్బులుకు వడ్డీలు చెల్లించలేకపోతున్నారు.ఎదురు పెట్టుబడి పెట్టి చేసిన పనులకు కూడా బిల్లులు రావడానికి నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా లో 461 గ్రామ పంచాయితీ లో మెజారిటీ గ్రామ పంచాయితీ సర్పంచ్ లు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్ఆర్జిఎస్ స్కీంలో చేసిన శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, నర్సరీలకు సైతం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సకాలంలో బిల్లులు పొందలేక పోయారు. ఇప్పటికి పూర్తి స్థాయిలో శ్మశాన వాటిక లు నిర్మించిన సర్పంచ్ లకు సైతం బిల్లులు రాలేదు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీలకు భవనాలు లేక అద్దె భవనాల్లో నడుపుతున్నారు. నూతనంగా నిర్మించిన జీపీ బిల్డింగ్ భవనాలకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు. గ్రామ సర్పంచిగా ఎన్నికైనప్పటి నుండి నేటి వరకు ఏ ఒక్క పనికి డబ్భులు సరైన సమయంలో రాలేదు.

కేంద్ర నిధులు సరిపడడం లేదు

beruvada sarpanch

మా గ్రామంలో 1500 మంది జనాభా ఉన్నారు. ప్రతి నెల 1,80,000 రూపాయలు 15వ ఆర్ధిక సంఘ నిధులు జీపీ అకౌంట్ లో జమ అవుతున్నాయి. ఈ నిధులతోనే సిబ్బంది జీతాలు, గ్రామ పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్‌సీ నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. 10 లక్షల రూపాయల తో స్మశాన వాటిక నిర్మాణం చేసి మూడు నెలలు అవుతున్న కేవలం 2.70 లక్షలు మాత్రమే వచ్చాయి.మిగిలిన డబ్భులు వస్తాయన్న నమ్మకం లేదు.అప్పులు తెచ్చి పనులు చేస్తున్నాం. ప్రభుత్వం గ్రామ పంచాయితీలపై చిన్న చూపు చూస్తుంది. నాకు 30 లక్షల అప్పు ఉంది. నా పదవి కాలం పూర్తి అయినప్పటికి నా అప్పులు తీరే పరిస్థితి లేదు.

– ముదిగిరి సాంబయ్య
బేరువాడ గ్రామ సర్పంచ్,
కేసముద్రం మండలం,మహబూబాబాద్ జిల్లా



Next Story

Most Viewed