కరోనా సోకని గ్రామం… వారిని కాపాడుతోంది ఎవరు..?

by  |
Jagannathpur
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉత్తరాన గోదావరి పరవళ్లు.. తూర్పున పెద్దవాగు. రెండు వైపులా విస్తరించిన కీకారణ్యాలు. ప్రకృతి వనంలో వెలసిన ఆ గ్రామం అంటేనే కరోనా వైరస్ జంకుతుందేమో. 800 మంది జనాభా ఉన్న ఈ పల్లెలో కరోనా మహమ్మారి ఊసే లేకుండా ప్రశాంతంతగా జీవనం సాగిస్తున్నారు అక్కడి జనం. ఆధునిక పోకడలు, జంక్ ఫుడ్ మాయలో మునిగి తేలుతున్న కాంక్రీట్ జంగిల్ ప్రపంచానికి భిన్నంగా ఉన్న ఆ ఊరు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. అడవులు, గుట్టల్లో తునికాకు సేకరిస్తూ.. ఊరంత ఒక్క తాటిపై నడుస్తున్న తీరే కరోనాను వారి దరి చేరనీయలేదా అనిపిస్తోంది.

Jagannathpur01

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ గ్రామం కరోనా బారిన పడకుండా ఉన్న అతి తక్కువ పల్లెల సరసన చేరింది. రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించినా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడమే గ్రామస్థుల ఆరోగ్య సూత్రాలను స్పష్టం చేస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ్ పూర్ లో 800 మందికి పైగా జనాభా ఉంది. 247 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆదివాసిలోని గోండు, నాయకపోడు తెగలకు చెందిన కుటుంబాలే ఇక్కడ నివసిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇరుగు, పొరుగు గ్రామాలతో సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. శుభాకార్యాలకు కూడా వేరే గ్రామం నుండి పిలిచే సాంప్రదాయానికి కూడా స్వస్తి పలికారు. ఊర్లో ఉండే వారే ఆత్మీయులుగా భావించుకుని వేడుకలు నిర్వహించుకుంటున్నారు.

వేసవి కాలం కావడంతో గ్రామంలోని కొంతమంది మహిళలు మాత్రం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలోని బొర్నపల్లి గుట్టకు వెళ్లి తునికాకు సేకరించుకుంటున్నారు. గ్రామానికి చేరుకున్న తరువాత వేసవి తాపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, వేసవి తీవ్రత నుండి ఉపశమనం కోసం జొన్న అంబలి తాగిస్తున్నారు.

Jagannathpur02

రొట్టే… బువ్వ…

ఇకపోతే గ్రామస్థులంతా రోజూ తినే ఆహారం వింటే ఆశ్చర్యపోక మానరు. జొన్నలే వారికి ఆహారం. అంబలి, రొట్టె, గటకల రూపంలో వీరు జొన్నలను ఆహారంగా తీసుకుంటున్నారు. గ్రామంలోని లభ్యమయ్యే జొన్నలు సరిపోకపోవడంతో ఇటీవల గోదావరికి అవతలి వైపున ఉన్న సరిహద్దు గ్రామాల్లో జొన్నలను కొనుగోలు చేసి తెప్పించుకున్నారు. వాటినే ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి అందించే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ పల్లె సహజ వనరుల నడుమ వెలిసింది. ప్రకృతిని ఆరాధించే ఈ పల్లె బిడ్డలు అడవిని కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్లే ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.

అడవి తల్లే కాపాడుతోంది…

Athram Vijaya

ప్రకృతిని కాపాడుకుంటూ జీవనం సాగించడం వల్లే ఇంతటి భయంకర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కరోనా మా పల్లె దరికి రాకపోవడం మాకు ఆనందాన్ని కల్గిస్తోంది. గ్రామస్థుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. అడవులను నరికి వాటిని సమూలంగా నాశనం చేసే విధానం మాకు లేదు. ఇది మా పూర్వీకుల నుండి ఆచారంగా వచ్చిన సాంప్రదాయం. ఈ కారణంగానే గ్రామం చుట్టూ సహజసిద్ధమైన వనసంపద కలిపిస్తుంది. ఆ అడవి తల్లే మాకు రక్షణ ఇస్తోంది.
-ఆత్రం విజయ, సర్పంచ్, జగన్నాథ్ పూర్

Next Story

Most Viewed