లీడర్లపై సాఫ్ట్ కార్నర్.. సామాన్యులకు నోటీసులు..!

by  |
లీడర్లపై సాఫ్ట్ కార్నర్.. సామాన్యులకు నోటీసులు..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ భూ దందాలో ప్రమేయం ఉన్న బడాబాబులపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా? సామాన్యులపైనే చట్టం ఉపయోగిస్తున్నారా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బొమ్మకల్ శివారులోని ప్ర భుత్వ భూములతో పాటు చెరువులు, కుంటలకు సంబంధించిన శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ క్రమంలో ఫిర్యాదుల పరంపరం కొనసాగడంతో గ్రామ సర్పంచ్ శ్రీని వాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ శశాంక ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో కమిటీ వేయించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కమిటీలు రికార్డులు పరిశీలించి పలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి.

కబ్జాలో 12 ఎకరాలు..

147 సర్వే నెంబర్‌లోని దాదాపు 12 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇందులో నివాసం ఉంటున్న 25 మందికి నోటీసులు జారీ చేసిన అధికారులు ఇతర సర్వే నెంబర్లలో ఆక్రమణకు గురైన వారి విషయంపై దృష్టి సారించకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు, వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది అంతు చిక్కకుండా తయారైంది. ఈ వ్యవహారంలో పలుకుబడి ఉన్నవారి ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నవారి మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. బొమ్మకల్ గ్రామంలో భూముల ధరలు అడ్డగోలుగా పెరగడంతో ఏకంగా సర్కారు స్థలాలపై కన్నేసి ఇష్టం వచ్చినట్లు రికార్డులు మార్చుకున్నారన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

సంబంధం ఉన్న వారెవరు?

రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ, శిఖం భూమి అని స్పష్టంగా ఉన్నా కూడా సంబంధిత శాఖ అధికారులు ఇంతకాలం పట్టించుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నగా మారింది. దీనిలో ప్రమేయం ఉన్న వారెవరో కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. అత్యంత విలువైన భూములు ఉన్న బొమ్మకల్‌లో సర్కారు స్థలాలను కాపాడడంలో రెవెన్యూ అధికారులు విఫలం అయినట్లు స్పష్టం అవుతోంది. భూ దందాకు పాల్పడిన వారికి ఇంటి దొంగల అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే రికార్డులు తారు మారయ్యాయని, రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయన్నది వాస్తవం.

Next Story

Most Viewed