మహిళా వ్యాపారవేత్తలకు సిస్కో శుభవార్త

by  |
niti
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని మహిళా వ్యాపారవేత్తలకు డిజిటల్ ప్రయోజనాలు కల్పించడానికి నీతి ఆయోగ్ 2017లో ప్రారంభించిన డబ్ల్యూఈపీ కార్యక్రమ తదుపరి దశను గురువారం ప్రకటించారు. నీతి ఆయోగ్, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం సిస్కో సంయుక్తంగా మహిళల కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్(డబ్ల్యూఈపీ) వివరాలను వెల్లడించారు. ‘డబ్ల్యూఈపీ నెక్స్ట్’ పేరుతో ప్రారంభించిన ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు సిస్కో టెక్నాలజీ ద్వారా మెరుగైన అవకాశాలను అందించనున్నారు. డబ్ల్యూఈపీ ప్లాట్‌ఫామ్ భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉండే మహిళలు తమ వ్యాపారాల లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కల్పిస్తుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్.. ఆరో ఆర్థిక జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం 5.85 కోట్ల మంది పారిశ్రామికవేత్తలలో 80.5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు(13.76 శాతం) మాత్రమే ఉన్నారని చెప్పారు. ‘డబ్ల్యూఈపీ నెక్స్ట్’ ప్లాట్‌ఫామ్ మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమంలో సిస్కో భాగస్వామ్యంపై నమ్మకం ఉంది. సంస్థ టెక్నాలజీ ద్వారా త్వరలో దేశంలోని ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ మార్గదర్శి అవుతుందని’ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ‘నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. మరిన్ని మహిళా యాజమాన్య సంస్థలకు డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని’ సిస్కో సీఈఓ అన్నారు. డబ్ల్యూఈపీ కార్యక్రమం ద్వారా విభిన్న వ్యాపారాలను నిర్వహించే మహిళలను ఒకచోట చేర్చి వారికవసరమైన వనరులను, మద్దతును నీతి ఆయోగ్ అందిస్తోంది.


Next Story

Most Viewed