భీమ్లా నాయక్ భార్యగా ట్యాలెంటెడ్ బ్యూటీ ఫిక్స్..

171

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుపాటి మల్టీస్టారర్ శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటుంది. అయ్యప్పన్ కోషియం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ భీమ్లా నాయక్ గా పవన్ కనిపించనుండగా.. మాజీ ఆర్మీ ఆఫీసర్ గా రానా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం సగం షూటింగ్ ని పూర్తిచేసుకున్నా ఇప్పటివరకు హీరోల సరసన ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారో మేకర్స్ చెప్పలేదు. ఎప్పటినుంచో పవన్ సరసన సాయి పల్లవి, నయన తార లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గత కొన్ని రోజుల నుంచి నిత్యామీనన్ పేరు గట్టిగా వినపడింది. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ భీమ్లా  నాయక్ భార్యగా నిత్యామీనన్ నే ఖరారు చేశారు మేకర్స్. నిత్యా మీనన్ లుక్ ని రివీల్ చేస్తూ ఈ చిత్రంలోకి ఆహ్వానించారు.

ట్యాలెంటెడ్ బ్యూటీ నిత్యా, పవన్ సరసన నటించడం ఇదే మొదటిసారి. కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల సరసనా ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ మెప్పించినా ఈ భామ ఇప్పుడు పవన్ సరసన కనిపించనుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఒరిజనల్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యతా లేకపోయినా తెలుగులో నిత్యా కోసం ఒక స్పెషల్ రోల్ ని డైరెక్టర్ క్రియేట్ చేసాడని టాక్. ఇందులో నిత్యా పాత్ర కీలకంగా ఉండనుందట. త్వరలోనే నిత్యామీనన్ #PSPKRana సెట్ లో అడుగుపెట్టనుంది. ఏది ఏమైనా కాస్టింగ్ విషయంలో మేకర్స్ ఆచితూచి అడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక రానా సరసన మరో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..