తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. వాళ్లే టార్గెట్

by  |
NIA
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘాలకు చెందిన నాయకుల ఇళ్లల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఏక కాలంలో సోదాలు చేపట్టారు. రెండు రాష్ట్రాలలో సాయంత్రం 4 గంటల తర్వాత జరిగిన ఈ సోదాల్లో ఏమేం దొరికాయన్నది అధికారకంగా ప్రకటించకపోయినా విప్లవ సాహిత్యం, నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నట్లు ధృవీకరించే పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ నివాసం (గుంటూరు జిల్లా సత్తెనపల్లి), విరసం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి నివాసం (కడప జిల్లా ప్రొద్దుటూరు), కర్నూలు పట్టణంలోని ఆరోరో నగర్‌లో ‘విరసం’ మాజీ కార్యదర్శి పినాకపాణి (జర్నలిస్టు కూడా) నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులైన న్యాయవాది రఘునాథ్ (దిల్‌సుఖ్‌నగర్), జననాట్య మండలి మాజీ కళాకారుడు డప్పు రమేష్ (గుడిమల్కాపూర్, హైదరాబాద్)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. భీమా కొరేగావ్ సంఘటనలో వీరి ప్రమేయం ఉందన్న అనుమానంతో ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. కానీ ఎంత మంది నివాసాల్లో సోదాలు జరిగాయి, ఏ అనుమానంతో జరిగాయి, వారిపై వచ్చిన ఆరోపణలు తదితరాలపై మాత్రం ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించలేదు.

విశాఖపట్నం నుంచే కదలిక

విశాఖపట్నం రూరల్ జిల్లా ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ పరిధిలో గతేడాది నవంబరు 23వ తేదీన జర్నలిస్టు పాంగి నాగన్న ద్వారా లభించిన సమాచారం మేరకు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. పాంగి నాగన్న గతేడాది నవంబరు 23న బాసుపుట్ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు అతని బ్యాగును తనిఖీ చేయగా విప్లవ సాహిత్యం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మందులు, కరెంటు వైర్, ఆ సంస్థ ప్రెస్‌నోట్‌లు దొరికినట్లు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయం పేర్కొంది. అతని నుంచి రాబట్టి సమాచారం మేరకు మొత్తం 64 మందికి ఇలాంటి సంబంధాలు ఉన్నట్లు ఈ ఏడాది మార్చి 7వ తేదీన రూపొందించిన ఎఫ్ఐఆర్‌ (నెం. ఆర్‌సీ-1/2021/ఎన్ఐఏ/హైదరాబాద్)లో ఎన్ఐఏ పేర్కొంది.

ముంచంగిపుట్టు ఎస్ఐ పొన్నాడ ప్రసాదరావు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్‌లో మొత్తం 64 మంది పేర్లను ప్రస్తావించగా అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురి ఇళ్లమీద, తెలంగాణలో ఇద్దరి నివాసాల్లో ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహించారు. మొత్తం 64 మందిలో పలువురు జర్నలిస్టులు, వివిధ ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వారు, న్యాయవాదులు, రచయితలు కూడా ఉన్నారు. వీరందరిపై మార్చి 7నాటి ఎఫ్ఐఆర్‌లో భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 120-బి 121, 121-ఏ, 124-ఏ రెడ్ విత్ 149, 143, 144 సెక్షన్లతో పాటు ‘ఉపా’ (అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం)లోని సెక్షన్ 10, 13, 18, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ లోని సెక్షన్ 8(1), 8(2), ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం కేసులు నమోదయ్యాయి.

హక్కులపై గొంతెత్తినందుకే సోదాలు : పౌరహక్కుల సంఘం

నిరంతరం ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తున్నందుకే ఎన్ఐఏ ఇప్పుడు ఆకస్మికంగా దాడులు చేసిందని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఒక ప్రకటనలో ఖండించారు. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఇంటిపై చేసిన సోదాల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు హక్కుల కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అందులో భాగమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు జరిగినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed