యువత కోసం కొత్త పథకం.. రూ.10 లక్షల రుణం మంజూరు

by  |
Microfood Processing
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో పనులు లేక ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో యూనిట్‌కు రూ.10లక్షల సాయం అందజేయనుంది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించనున్నాయి.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి రావాలనుకుంటున్న యువత సొంత యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న వారికి మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజస్ పథకం అండగా నిలువనుంది. ఫుడ్ ప్యాకేజింగ్, పానీయాల తయారీ తదితర మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది. అంతేకాదు పరిశ్రమల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్ యూనిట్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పనకు 35 శాతం క్రెడిట్ లింక్‌డ్ క్యాపిటల్ సబ్సిడీ అందజేస్తుంది.

రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల్లో స్థానికంగా పండే పంటల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందో గుర్తించాల్సి ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొదటగా మామిడి, బంగాళ దుంప, ఊరగాయ, మిల్లెట్, టమాటా, చేపల ఉత్పత్తులు, మాంసం, కోళ్ల పెంపకం తదితర ప్రాధాన్యత ఉన్న మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు సాయం అందజేయనున్నారు.

ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను అందజేయనుంది. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్, బ్రాండింగ్ చేయాలనుకుంటే 50 శాతం సబ్సిడీ అందుతుంది. ఈ పథకం ద్వారా రూ.35వేల కోట్ల పెట్టుబడులతో పాటు, 9 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అయితే 2020 నుంచి 2025 వరకు ఐదేళ్ల పాటు 10వేల కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేయాలనేది కేంద్రం ఆలోచన. ఇదిలా ఉంటే కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేయాలనే ఆలోచన ఉన్న యువత www.http//pmfme.mofdi.gov.in/pmfme వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా స్థాయిలో రిసోర్స్ యూనిట్లకు సంబంధించిన డీపీఆర్‌లను తయారు చేసి రుణ సదుపాయంతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను అందజేస్తారు. వెబ్ సైట్లో దరఖాస్తుతో పాటు జిల్లా నోడల్ అధికారికి దరఖాస్తును డీపీఆర్‌ను అందజేయాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం రుణం మంజూరు అవుతుంది.



Next Story

Most Viewed