బ్లాక్ ఫంగస్ మందులకు కొత్త ఆంక్షలు.. అమ్మకాలకు బ్రేక్

by  |
బ్లాక్ ఫంగస్ మందులకు కొత్త ఆంక్షలు.. అమ్మకాలకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా చికిత్సకు వాడుతున్న టొసిలిజుమాబ్ ఇంజెక్షన్ల తరహాలోనే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వ్యాధికి వాడే లిపోసొమల్ ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్లకు కూడా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆంక్షలు విధించింది. మందుల షాపుల్లో విక్రయాలకు బ్రేక్ వేసింది. ఈ ఇంజెక్షన్ అవసరం ఉన్నవారికి నేరుగా ఆస్పత్రులకే సరఫరా చేయనున్నట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పేషెంట్ కండిషన్‌ను బట్టి డాక్టర్ సిఫారసు చేస్తే ఆస్పత్రి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ముగ్గురి సభ్యులతో కూడిన కమిటీకి రిక్వెస్టు పెట్టి అక్కడి నుంచి ఆమోదం లభించిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ లేదా స్టాకిస్టు నుంచి పొందాల్సి ఉంటుందని వివరించారు. మందుల షాపుల్లో విక్రయాలను బంద్ చేసినందువల్ల స్టాకిస్టుల ద్వారా ఆస్పత్రులకు మాత్రమే సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఇంజెక్షన్‌ను తయారుచేసే కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులందరికీ సమాచారం ఇచ్చినట్లు వివరించారు.

ప్రస్తుతం కరోనా చికిత్సలో విస్తృతంగా వినియోగిస్తున్న స్టెరాయిడ్ టొసిలిజుమాబ్ ఇంజెక్షన్ తరహాలోనే బ్లాక్ ఫంగస్‌కు వాడే లిపొసొమాల్ ఆంఫొటెరిసిన్ ఇంజెక్షన్ల వినియోగానికి కూడా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. పేషెంట్ ఆరోగ్య స్థితికి అనుగుణంగా డాక్టర్లు సిఫారసు చేసినా దాన్ని ఈ కమిటీ అధ్యయనం చేసి దాన్ని వాడాలో లేదో నిర్ణయం తీసుకుని ఇంజెక్షన్లను పొందడానికి అనుమతి ఇస్తుంది.

ఆ అనుమతి ఆధారంగా స్టాకిస్టుల నుంచి ఆస్పత్రుల యాజమాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మందును బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలను అమ్మకుండా ఈ నిర్ణయం నియంత్రించవచ్చేమోగానీ అత్యవసర సమయాల్లో కమిటీ దృష్టికి తీసుకెళ్ళి అనుమతి పొంది సమకూర్చుకోడానికి గంటలు లేదా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, ఇది ఆచరణలో ఇబ్బందికరంగా మారుతుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ల అవసరం బాగా పెరిగింది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం, కృత్రిమ కొరతను సృష్టించడం, బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్ళడంతో కొరత ఏర్పడడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.



Next Story

Most Viewed