స్పోర్ట్స్ లీగ్‌లకు సరికొత్త తలనొప్పులు

by  |
స్పోర్ట్స్ లీగ్‌లకు సరికొత్త తలనొప్పులు
X

– నష్టాల్లో బ్రాడ్‌కాస్టర్లు
– కొత్త ఒప్పందాలకు ససేమిరా
– ఫుట్‌బాల్ లీగ్స్‌కే పెద్ద దెబ్బ

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా భయాందోళనలు నెలకొన్నవేళ క్రీడా లోకమంతా స్తంభించిపోయింది. క్రికెట్ నుంచి సాకర్ వరకు, టెన్నిస్ నుంచి హాకీ వరకు ఏ క్రీడలూ జరగడం లేదు. ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడలనే కరోనా భయానికి ఏడాదిపాటు వాయిదా వేశారు. ఈ వైరస్ సృష్టించిన ప్రళయానికి ఆట ఆగడమే కాదు.. క్రీడా సంస్థల ఆదాయాలకూ భారీగా గండి పడింది. ఏ క్రీడా సంస్థకైనా ఆదాయం వచ్చేది ప్రసార హక్కుల ద్వారా మాత్రమే. స్టేడియంలో టికెట్ల అమ్మకాలు, జట్టు స్పాన్సర్లు ఇచ్చే మొత్తాల కంటే బ్రాడ్‌కాస్టర్లు కురిపించే డబ్బులే ఎక్కువ. ప్రపంచంలోని కోట్లాది మందికి ఆటను చేరవేయడానికి టీవీ, ఇంటర్నెట్ వంటి మాధ్యమాలు పోటీ పడతాయి. ఈ నేపథ్యంలో ఆయా క్రీడల హక్కులను పోటీ పడి మరీ భారీ మొత్తాలకు దక్కించుకుంటాయి. కానీ, ఇప్పుడు ‘లైవ్ స్పోర్ట్స్’ అనేదే లేకుండా పోయింది. అన్ని ఆటలూ ఆగిపోవడంతో బ్రాడ్‌కాస్టర్లు నష్టాల బాట పట్టారు. ఇప్పటికే ఇకపై మీ ఆటలను మేం ప్రసారం చేయమని నేరుగా ఆయా క్రీడా సమాఖ్యలకు చెప్పేస్తున్నాయి. దీంతో ఇప్పటికే నష్టాల్లో కూరుకపోయిన క్రీడా సంస్థలు మరింత ఆందోళనలో పడ్డాయి.

ఫుట్‌బాల్స్ లీగ్స్‌కు పెద్ద దెబ్బ

కరోనా వైరస్ దెబ్బకు మొదట రద్దయింది యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్సే. ఫ్రెంచ్ ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు సంబంధించిన 10 రౌండ్ల మ్యాచ్‌లు ఉండగానే ఆటను రద్దు చేశారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అన్నిరకాల క్రీడలను రద్దు చేయడంతో ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఫ్రెంచ్ ప్రొఫెషనల్ లీగ్స్‌ను కానల్ ఫ్లస్, బి’ఇన్’ స్పోర్ట్ ఛానల్స్ ఇకపై ప్రసారం చేయమని ఖరాఖండీగా చెప్పేశాయి. అర్ధాంతరంగా లీగ్స్ వాయిదా పడినందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని, ఇక రాబోయే సీజన్లకు సంబంధించిన ప్రసారాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పాయి. అంతేకాకుండా ఈ ఏడాది బాకీ పడిన రూ. 912 కోట్లకుగాను కేవలం రూ. 304 కోట్లు మాత్రమే చెల్లించి, మిగతాయి ఇవ్వలేమని చేతులెత్తేసింది. మరోవైపు బి’ఇన్’ స్పోర్ట్స్ కూడా రూ. 342 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, రూ. 88 కోట్లు మాత్రమే చెల్లించి బాకీని రద్దు చేసుకోవాలని నిర్వాహకులను కోరింది. ఫ్రెంచ్ ప్రొఫెషనల్ లీగ్‌లో భాగంగా జరిగే లీగ్-1, లీగ్-2లో 40 ఫుట్‌బాల్ క్లబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రసార హక్కుదారులు డబ్బులు చెల్లించలేకపోవడంతో సదరు ఫ్రాంఛైజీలన్నీ ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ప్రసార హక్కుదారులు చెల్లించకపోయినా మాకు రావాల్సిన డబ్బు చెల్లించాల్సిందేనని ఫ్రాంచైజీలు పట్టుబట్టడంతో ఫ్రెంచ్ ప్రొఫెషనల్ లీగ్ రూ. 2వేల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాదైనా ఫుట్‌బాల్ మ్యాచులు జరుగుతాయో లేదో అనే సందిగ్ధంలోనే బ్రాడ్‌కాస్టర్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జర్మన్ ఫుట్‌బాల్ లీగ్‌ను ప్రసారం చేసే డిస్కవరీ ఛానల్ కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని సంకేతాలు ఇచ్చింది. ‘ఊహించని విపత్తు’ అనే క్లాజ్ ఆధారంగా మేం ప్రసార ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. ఆస్ట్రేలియా సాకర్ లీగ్ కూడా ఫాక్స్ స్పోర్ట్స్, ఏబీసీ టెలివిజన్ల నుంచి ఇలాంటి లేఖలే అందుకున్నాయి.

క్రికెట్ సంగతి..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బోర్డులకు ప్రసార సంస్థల నుంచి ఎలాంటి లేఖలు అందలేదు. బీసీసీఐతో ఒప్పందం ఉన్న స్టార్ గ్రూప్ భారీ నిధులను ఐపీఎల్ మీద వెచ్చించింది. ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడినా బీసీసీఐతో మాత్రం ఎలాంటి చర్చలు జరపలేదు. కాగా, ఐపీఎల్ పూర్తిగా రద్దైతే మాత్రం పరిహారం కోరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాకు మాత్రం బ్రాడ్‌కాస్టర్ల సెగ తగిలింది. సీఏతో ఫాక్స్‌టెల్ రూ.5600 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు క్రికెట్ పూర్తిగా స్తంభించడంతో ఆ మేరకు కొంత మొత్తాన్ని తగ్గించుకుంటామని తేల్చి చెప్పింది. క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రధాన ఆదాయం బ్రాడ్‌కాస్టర్ల ద్వారానే వస్తుంది. ఇప్పడు ఫాక్స్‌టెల్ నుంచి ఆదాయం కోల్పోవడంతో సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వేతనాల్లో కోత పెట్టింది. ఉద్యోగుల వేతనాల్లోనే కాకుండా క్రికెటర్ల జీతాల నుంచి కూడా భారీ కోతలే పెట్టింది. మరోవైపు కరోనాకు ముందు ప్రసార ఒప్పందాలు ముగిసిపోయిన బోర్డులతో తిరిగి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఏ సంస్థా ముందుకు రావడం లేదు. వెస్టిండిస్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో బ్రాడ్‌కాస్టర్ల ఒప్పందాలు పూర్తయ్యాయి. కానీ, ఇంతవరకు ప్రసారకర్తలు తిరిగి ఒప్పందం చేసుకోవాలని సంప్రదించకపోవడం గమనార్హం.

సినిమాలే మిన్న..

క్రీడా ఒప్పందాలు భారీగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ, అసలు నిజం ఏమిటంటే లైవ్ స్పోర్ట్స్‌కు ఉన్నంత గిరాకీ పున: ప్రసారాలకు ఉండవు. సినిమా రైట్స్ దక్కించుకొని ఎన్నిసార్లు వేసినా ప్రేక్షకులు చూస్తారు. కానీ, ఇవాళ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌ను రేపు వేసినా ఎవరూ చూడరు. స్టేడియం, టీవీల్లో చూసినా లైవ్ స్పోర్ట్స్‌కు ఉన్నంత ఆదరణ పున: ప్రసారాలకు ఉండకపోవడంతోనే స్పోర్ట్స్ ఛానల్స్ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో షూటింగ్స్, ఆటలు నిలిచిపోయాయి. పాత సీరియల్స్, టీవీ ప్రోగ్సామ్స్, సినిమాలు ప్రసారం చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కాస్తో కూస్తో సంపాదించుకుంటున్నాయి. కానీ, ఎన్ని గొప్ప మ్యాచ్‌లు ప్రసారం చేస్తున్నా క్రీడా ఛానెల్స్ ఆదాయం మాత్రం పెరగడం లేదు. లైవ్ క్రికెట్ లేకపోవడంతో ఐసీసీ పాతకాలం మ్యాచ్‌ల ఆర్చివ్స్ టీవీ ఛానెల్స్‌కు అందించింది. అయినా సరే ఆ మ్యాచ్‌ల ఆదరణ అంతంత మాత్రమేనని టీఆర్పీలు చెబుతున్నాయి. మళ్లీ లైవ్ స్పోర్ట్స్ గాడిన పడే వరకు క్రీడా ఒప్పందాలపై ముందుకు వెళ్లకూడదని క్రీడా ఛానెళ్లు భావిస్తున్నాయి.

Next Story

Most Viewed