నెల్లూరు మేయర్ పీఠం బీజేపీదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

by  |
somu virraju
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు నగర మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ పక్షంతో, ప్రతిపక్ష తెలుగుదేశం కుమ్మక్కైందని ఆరోపించారు. నెల్లూరులో బుధవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోటి చేసిన అన్ని చోట్లా తెలుగుదేశం పార్టీ వైసీపీతో పోటీ పడలేక వెనకబడుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీకి పోటీ ఇచ్చేది బీజేపీయేనని తేల్చి చెప్పారు. మీకు ప్రజాబలం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకు ఎన్నికలు జరపించడం లేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కారంపూడిలో బీజేపీ అభ్యర్థికి ఎంఓసీ ఇవ్వకుండా దారుణాలకు పాల్పడ్డారని అధికారులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీకు జీతాలు ఇచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి కాదు.. ప్రభుత్వమనే విషయం గుర్తుంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు.

కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి..

రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో కేంద్రం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం ఒక్కో మనిషికి సగటున రూ. 640 ఇస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి ప్రతి ఏటా రూ.5 కోట్లు ఇప్పిస్తున్నామని తెలిపారు. అమృత్ పథకం కింద నెల్లూరుకు రూ.1150 కోట్లు నిధులు కేటాయించామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో మీ భాగస్వామ్యం ఏముందో చెప్పాలని సీఎం వైఎస్ జగన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed