వేతనాల పెంపును ప్రకటించిన విప్రో.!

by  |
వేతనాల పెంపును ప్రకటించిన విప్రో.!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు నష్టపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అయితే, ఐటీ కంపెనీ (IT company)లు మాత్రం కరోనా సంక్షోభంలోనూ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించిన ఉద్యోగులకు గౌరవాన్నిస్తూ వేతనాలను పెంచాయి. ఈ క్రమంలోనే ఐటీ దిగ్గజం విప్రో (wipro)ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. సంస్థలోని 80 శాతం ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి వేతన పెంపును అందించనున్నట్టు వెల్లడించింది. బీ3, కిందిస్థాయి సిబ్బందికి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్టు, సీనియర్ ఉద్యోగుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని విప్రో తెలిపింది.

విప్రోలో ప్రస్తుతం మొత్తం 1.85 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో 1.5 లక్షల మందికి వేతన పెంపు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇదివరకటి లాగే మెరుగైన సామర్థ్యం కనబర్చిన వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కరోనా లాంటి సందర్భంలో సవాళ్లను అధిగమించి క్లిష్ట సమయంలో తమ ఉద్యోగులు ప్రతిక్షణం సంస్థ కొనసాగింపులో నాణ్యమైన సేవలను అందించినట్టు విప్రో ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఐటీ కంపెనీలు మిడిల్, సీనియర్ స్థాయిలో నైపుణ్యాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. విప్రో సైతం మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగుల విషయంలో కంపెనీ వివిధ చర్యలను చేపడుతున్నట్టు ప్రతినిధులు చెప్పారు. కాగా, దేశీయ మరో ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys)వచ్చే ఏడాది జనవరి నుంచి వేతనాల పెంపును చేపట్టనున్నట్టు వెల్లడించగా, మరో దిగ్గజం టీసీఎస్ (TCS) అక్టోబర్ నుంచి వేతన పెంపును వర్తింపజేయనున్నట్టు తెలిపింది.

Next Story