6 జిల్లాల్లో జీరో ఓటింగ్.. ఎందుకో తెలుసా ?

by Dishanational4 |
6 జిల్లాల్లో జీరో ఓటింగ్.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : నాగాలాండ్‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. దీనికి శుక్రవారం ఎన్నిక జరగగా.. 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ శాతం నమోదైంది. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్’ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారని తెలిసింది. ఈ ఆరు జిల్లాల్లో 4 లక్షల మంది ఓటర్లు ఉండగా.. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీఓ) పిలుపుమేరకు ఎన్నికలను బహిష్కరించారని సమాచారం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ ఆరు జిల్లాల్లో అస్సలు 1 శాతం కూడా ఓటింగ్‌ నమోదు కాలేదు. దీంతో పోలింగ్ కేంద్రాలన్నీ బోసిపోయి కనిపించాయి. ఎన్నికల సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్’ ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో ఉన్న 738 పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్’‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌‌‌తో 2010 సంవత్సరం నుంచే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉద్యమం చేస్తోంది. మోన్, ట్యూన్‌సాంగ్, లాంగ్‌లెంగ్, కిఫిర్, షామటోర్, నోక్లాక్ అనే ఆరు జిల్లాలతో కూడిన తమ ప్రాంతం అన్ని రంగాలలో అన్యాయానికి, వివక్షకు గురైందని ఆ ఉద్యమసంస్థ వాదిస్తోంది. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. వాటిలో 20 స్థానాలు ‘ఫ్రాంటియర్ నాగాలాండ్’ ప్రాంతానికి చెందినవే. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్‌కు నాగాలాండ్‌లో ఏడు గిరిజన సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారానే అది ఉద్యమాలు చేస్తుంటుంది.

Next Story

Most Viewed