రాంగ్ రూట్‌.. కీలక సమయంలో దారితప్పిన రాహుల్ 'జోడో యాత్ర'

by GSrikanth |
రాంగ్ రూట్‌.. కీలక సమయంలో దారితప్పిన రాహుల్ జోడో యాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ జోడో యాత్ర పేరుతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీచేస్తున్న పాదయాత్రపై విమర్శలు మొదలయ్యాయి. అవసరమయ్యే ప్రాంతాల్లో కాకుండా.. రాంగ్ రూట్‌లో యాత్ర చేస్తున్నారనే అసంతృప్తి జాతీయ స్థాయి నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇలాంటి యాత్ర చేపట్టితే షెడ్యూల్‌కు ముందే కలిసి వచ్చే అవకాశాలుండేవని, కానీ, ఎప్పుడో ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఎందుకు ఎన్నుకున్నారనే ప్రశ్నలు ముందుకొచ్చాయి. కీలక సమయంలో రాహుల్​గాంధీ ప్రచారానికి దూరమవుతారని స్పష్టమవుతోంది. 150 రోజుల జోడో యాత్రకు ఎక్కడా బ్రేక్ ఉండదంటూ జోడో టీం ప్రకటించింది. ఈ లెక్కన వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది.

సౌత్‌లో రాహుల్.. నార్త్‌లో ఎలక్షన్

ఈ మధ్య కాలంలోనే.. మరో కొన్ని నెలల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌లోనే గుజరాత్‌కు, ఆ తర్వాత నెలలోనే హిమాచల్ ప్రదేశ్‌కు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పాగా వేయాలని అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే పంజాబ్‌లో సాధించిన ఫలితాన్నే ఇక్కడా సాధించాలనే ప్రయత్నాలను ఆమ్ ఆద్మీ పార్టీ కొనసాగిస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ సౌత్ ఇండియాలో పాదయాత్ర చేస్తుండటంతో గుజరాత్ పొలిటికల్ గ్రౌండ్‌లో కాంగ్రెస్ ఎక్కడ కనిపించడం లేదని స్పష్టమవుతూనే ఉంది.

హామీలిచ్చి... వెనకడుగు

భారత్ జోడో యాత్ర ప్రారంభించేందుకు రెండు రోజుల ముందు గుజరాత్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌లో నిర్వహించిన పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంపై హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ, వంట గ్యాస్ సిలిండర్ రూ.500 లకే అందిస్తామని అన్నారు. అలాగే సాధారణ వినియోగదారులకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఆ మేరకు ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతోందని, భారత్ జోడో యాత్రపై ఫోకస్ పెట్టడంతో ఈ హామీలు ప్రజల్లోకి చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ స్టార్స్ వాళ్లే కదా

కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే స్టార్స్‌గా పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏఐసీసీ నేతలు ఉన్నా.. ప్రచారంలో మాత్రం వీరిదే తొలి ప్రాధాన్యత. ఇలాంటి పరిణామాల్లో సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఏఐసీసీ నేతలకు కూడా కొన్ని సందర్భాల్లో అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇక ప్రియాంక గాంధీ ఇప్పటికీ గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. అడపాదడపా మీటింగ్‌లకే తప్ప.. పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది తక్కువే. దీంతో రాహుల్ గాంధీపైనే ఫోకస్ ఉంటోంది. జాతీయ స్థాయిలోనూ రాహుల్ లక్ష్యంగానే విమర్శలు సాగుతున్నాయి. వాటికి సమాధానం ఇవ్వడంలో కూడా రాహుల్ గాంధీదే ప్రధానం. పార్టీ తరుపున స్వతంత్రంగా హామీలిచ్చే అధికారం కూడా రాహుల్ గాంధీకే ఉంటోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ స్టార్ రాహుల్ గాంధీ అని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇలా.. అలా.. ఇలా యాత్ర

రాహుల్ జోడో యాత్రపై ముందు నుంచీ అసంతృప్తి ఉంటోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో జోడో యాత్రను ఖరారు చేశారు. కానీ, ఎన్నికలు ఉండే గుజరాత్​, హిమాచల్ ప్రదేశ్ వైపు కనీసం అడుగు కూడా వేయడం లేదు. మరోవైపు ఎన్ని అవాంతరాలు ఎదురైనా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో ఏం చేస్తుందనే విషయంపై పార్టీలో గందరగోళం ఏర్పడుతోంది. ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 150 రోజులు జోడో యాత్రను ఇప్పటి నుంచి లెక్కించినా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. అంటే ఆలోపే ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. యాత్రలోనే రాహుల్ కొనసాగితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రచార బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారనేది సందేహాంగా మారింది. దీంతో పరిస్థితులు పీక్స్‌కు చేరిన తర్వాత రాహుల్ భారత్ జోడో యాత్ర నుండి ప్రచారానికి వస్తారా? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి.

కాంగ్రెస్‌పై గురి పెట్టిన కేజ్రీవాల్

పంజాబ్‌లో కాంగ్రెస్ నుండి అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్‌లో గట్టి ప్రయత్నం చేస్తోంది. బీజేపీని గద్దె దింపి ఎలాగైనా అధికారంలోకి రావాలని కృషి చేస్తోంది. ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్ కాంగ్రెస్ పని అయిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సరైన తీరితో కాంగ్రెస్ కౌంటర్ వేయలేకపోయిందని, భారత్ జోడో యాత్రపైనే ఫోకస్ పెడితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నష్టం తప్పదనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.

పీకే వ్యాఖ్యలతోనూ కలకలం

జోడో యాత్రపై రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర గుజరాత్ లేదా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రారంభించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడిన ఆయన.. అసలు యాత్రను ఆయన తప్పుపట్టారు. దీనిలో కొంతమంది కాంగ్రెస్ నేతలు వెనకున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. పీకేతో కొంతమంది నేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేయించారని జాతీయ నేతలు కూడా భావిస్తున్నారు.

Also Read : ఆరేళ్ల తర్వాత సోనియాతో సీఎం భేటీ.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ..?

Next Story

Most Viewed