దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు.. విద్యుత్ డిమాండ్ మరింత పైకి

by Disha Web Desk 17 |
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు.. విద్యుత్ డిమాండ్ మరింత పైకి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కపోత మొదలు కావడంతో భారతదేశ విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. మార్చి 25న దేశంలో విద్యుత్ డిమాండ్ 182.6 GW కాగా, ఇది మూడు రోజుల వ్యవధిలో 28 నాటికి 215.3 GWగా నమోదైంది.

ముఖ్యంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఎల్ నినో పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో వేడి వాతావరణం మరింత పెరిగి విద్యుత్ వినియోగం భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో గరిష్ట విద్యుత్ డిమాండ్‌ 256.53 GWకు చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మార్చి 27 వరకు దేశీయ థర్మల్ పవర్ ప్లాంట్‌లలో బొగ్గు నిల్వలు 46.7 మిలియన్ టన్నులుగా ఉన్నాయి, ఇది సుమారు 20 రోజులకు సరిపోతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డేటా పేర్కొంది. ఇటీవల బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా మాట్లాడుతూ, 2025 కోసం, విద్యుత్ మంత్రిత్వ శాఖ 874 మి.టన్నుల బొగ్గును కోరిందని, బొగ్గు మంత్రిత్వ శాఖ దీనిని తీర్చగలదని అన్నారు.


Next Story

Most Viewed