చేతులెత్తి మొక్కుతున్నా.. సీఎంగా ఉండాలా ? వద్దా ? : సీఎం

by Dishanational4 |
చేతులెత్తి మొక్కుతున్నా.. సీఎంగా ఉండాలా ? వద్దా ?  : సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక సీఎంను మారుస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. రాష్ట్ర మంత్రి మహాదేవప్ప కుమారుడు సునీల్ బోస్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా చామరాజనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసందర్భంగా సునీల్ బోస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య ఎమోషనల్ అయ్యారు. ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉండాలా..? వద్దా..? చేతులెత్తి మొక్కుతున్నాను.. సునీల్ బోస్‌ను 60 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. “2019 లోక్‌సభ ఎన్నికల్లో ధృవనారాయణ (కాంగ్రెస్ అభ్యర్థి) కేవలం 1,817 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ స్థానంలో నన్ను 48,000 ఓట్ల ఆధిక్యంతో గెలిపించారు. ఇప్పుడు అదే ఆధిక్యత లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యతతో సునీల్ బోస్‌ను గెలిపించండి’’ అని ఆయన ఓటర్లను కోరారు. ప్రచారం సందర్భంగా వరుణ నియోజకవర్గ ప్రజలతో సిద్దరామయ్య మనసు విప్పి మాట్లాడారు. ‘‘మీకు నేను ఎవరో తెలుసు. మంత్రి మహాదేవప్ప చాలా బాగా తెలుసు. వరుణ అసెంబ్లీ సీటు నుంచి గతంలో నా కుమారుడు యతీంద్ర కూడా ప్రాతినిధ్యం వహించాడు. మేమందరం తెలిసినందున సునీల్ బోస్‌కు కనీసం 60 వేల ఓట్ల మెజార్టీ రావాలి. అలా జరిగితేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత నన్ను టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గట్టి మెజార్టీ ఇవ్వండి. గెలిచిన తర్వాత వచ్చి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను’’ అని సిద్దరామయ్య కోరారు.



Next Story