పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు.. 34కు చేరిన జడ్జీల సంఖ్య

by Disha Web Desk 17 |
పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు.. 34కు చేరిన జడ్జీల సంఖ్య
X

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకుంది. అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీలుగా ఇటీవలే ఐదుగురిని నియమించిన కేంద్రం.. శుక్రవారం మరో ఇద్దరి నియామకానికి ఆమోదం తెలిపింది. అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించింది. కొలీజియం పంపిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల ఖాళీలన్నీ భర్తీ అయ్యాయి. న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 34కు చేరింది.

ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో స్పందిస్తూ, 'రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. వారికి నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. కాగా, చివరిసారిగా జస్టిస్ రంజన్ గొగోయ్ సీజేఐగా ఉన్న సమయం(2018-19)లో న్యాయస్థానం పూర్తి సామర్థ్యంతో నడవగా, దాదాపు మూడేళ్లు దాటిన తర్వాత మరోసారి ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.

Next Story

Most Viewed