కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకొస్తారా?.. ప్రధాని మోడీకి కాంగ్రెస్ ఎంపీ సవాల్

by S Gopi |
కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకొస్తారా?.. ప్రధాని మోడీకి కాంగ్రెస్ ఎంపీ సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, సవాళ్లు పెరుగుతున్నాయి. తమిళనాడులో కచ్చతీవు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కచ్చతీవు అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. తమిళనాడుపై మోడీకి అంత శ్రద్ధ ఉంటే గనక శ్రీలంక నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలని పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ సవాల్ చేశారు. 'ప్రధాని మోడీకి నేను సవాలు చేస్తున్నాను. తమిళనాడు ప్రజల గురించి అంత శ్రద్ధ ఉంటే కచ్చతీవును వెనక్కి తీసుకొస్తారా? పదేళ్ల నుంచి ఈ వ్యవహారంలో మోడీ విఫలమయ్యారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే ఆ పార్టీ ప్రజల ఆలోచనను మళ్లించే చౌకబారు వ్యూహాలు రచిస్తోందని ' మాణికం విమర్శించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాదు. అన్నామలై కూడా గెలవలేరు. రామనాద్ జిల్లాలో తమిళ మత్స్యకారులపై దాడి జరిగితే శ్రీలంక నుంచి ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ తన స్వరాన్ని పెంచుతుందని ఆయన హామీ ఇచ్చారు.

1974లో కచ్చతీవును ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దీనివల్లే ఈ అంశం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మోడీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె.. తమిళనాడు ఎన్నికల్లో లబ్ది పొందడానికే సున్నితమైన ఈ అంశాన్ని మోడీ రాజకీయం చేస్తున్నారని, అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఆయన వెనక్కి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పటి భారత ప్రభుత్వం ఇందిరా గాంధీ-సిరిమావో బండారునాయకే ఒప్పందంపై సంతకం చేసింది. ఆ సమయంలో, 6 లక్షల మంది తమిళులను రక్షించడానికి, వారు పాత రామనాద్ జిల్లాకు చెందినవారు కాబట్టి, ఈ కచ్చతీవు ద్వీపాన్ని భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది తమిళులను రక్షించడానికి చేయబడిందఅని పేర్కొన్నారు.

Advertisement

Next Story