‘ఆదిపురుష్’ టీమ్ జాతికి క్షమాపణలు చెప్పాలి.. ఉద్ధవ్ శివసేన ఎంపీ ప్రియాంక డిమాండ్

by Dishafeatures2 |
‘ఆదిపురుష్’ టీమ్ జాతికి క్షమాపణలు చెప్పాలి.. ఉద్ధవ్ శివసేన ఎంపీ ప్రియాంక డిమాండ్
X

ముంబై : ‘ఆదిపురుష్‌’ మూవీ టీమ్ పై శివసేన (ఉద్ధవ్ థాక్రే) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అయింది. ఇందులో అమర్యాదకరమైన సంభాషణలను ఉపయోగించినందుకు మూవీ టీమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రియాంక డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ విషయంలో ‘ఆదిపురుష్‌’ డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు ఇలాంటి భాషను వినియోగించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు. "మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్‌ విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటేయడం అస్సలు ఆమోదించదగ్గ విషయం కాదు" అని చెప్పారు.

ఈ సినిమాపై హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత మానస్‌లోని పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్ లో చూపించిన పాత్రలు చాలా భిన్నంగా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. "బ్రాహ్మణుడైన రావణుడిని గడ్డంతో చూపించారు.. ఆంజనేయుడి పాత్ర భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేలా లేదు.. రామాయణాన్ని అపహాస్యం చేసేలా కొన్ని సీన్లు ఉన్నాయి" అని ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సీన్లను మూవీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: 'భోళా శంకర్' కు కీర్తి సురేష్ డబ్బింగ్ షురూ..


Next Story