కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.1లక్ష 88వేల కోట్లు.. వైసీపీ ఎంపీకి కేంద్ర మంత్రి జవాబు

by Dishafeatures2 |
కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.1లక్ష 88వేల కోట్లు.. వైసీపీ ఎంపీకి కేంద్ర మంత్రి జవాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జీఎస్టీతో సహా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల మొత్తంలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద గత ఆరేళ్లలో రూ.1,88,053.83 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వాటా కింద విడుదల చేస్తున్న పన్నుల ఆదాయం గత 5 ఏళ్ళుగా తగ్గుతూ వస్తోందా? అంటూ రాజ్యసభలో మంగళవారం వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర వసూలు చేసిన పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 2017-18లో 29,001.25 కోట్లు, 2018-19లో 32,787.03 కోట్లు, 2019-20లో 28,242.39 కోట్లు, 2020-21లో 24,460.59 కోట్లు, 2021-22 లో 35,385.83 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 38,176.74 కోట్లు విడుదల చేసినట్లు సమాధానంగా చెప్పారు.

అలాగే దేశంలోని 29 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల వాటా కింద గడిచిన ఆరేళ్ళలో 45,11,442.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2017-18లో 6,73,005.29 కోట్లు, 2018-19లో 7,61,454.15 కోట్లు, 2019-20లో 6,50,677.05 కోట్లు, 2020-21లో 5,94,996.76 కోట్లు, 2021-22 లో 8,82,903.79 కోట్లు, 2022-23 మార్చి 10 నాటికి 9,48,405.82 కోట్లు ఆయా రాష్ట్రాల వాటా కింద విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.



Next Story