బ్రేకింగ్: రేపు స్కూళ్లకు సెలవు.. సీఎం కీలక నిర్ణయం..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: రేపు స్కూళ్లకు సెలవు.. సీఎం కీలక నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టడంతో ఉత్తరాదిన వరద బీభత్సం అలాగే కొనసాగుతోంది. ఈ వరదల దాటికి ఇప్పటికే 12 మంది మృతి చెందారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీని కుంభ వృష్టి కుదిపేస్తోంది. గత 42 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఒక్క రోజే వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో దేశ రాజధానిలో 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధం అయ్యాయి. ఢిల్లీలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో.. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరో రెండు రోజుల పాటి భారీ వర్షాల కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ అధికారులందరికి సెలవులు రద్దు చేశారు. అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షం దాటికి హిమాచల్ ప్రదేశ్‌లో 14 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అధికారులు అప్రమత్తమై.. రాష్ట్రంలోని 700 రహదారులను క్లోజ్ చేశారు. బియాస్ నది ప్రమాదకరంగా ప్రవాహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story

Most Viewed