సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన ఆప్ అధిష్టానం

by Disha Web Desk 2 |
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన ఆప్ అధిష్టానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఇవాళ తీహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక ప్రకటన చేసింది.

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని ఆ పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌కు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆప్ కీలక నేత జాస్మిన్ షా మీడియాతో మాట్లాడుతూ రాజీనామాపై స్పష్టత ఇచ్చారు. కాగా, ఈ కేసులో 9 సార్లు ఈడీ సమన్లను జారీచేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.



Next Story