'మా లక్ష్యం ఉగ్రవాదులు.. ముస్లింలు కాదు'.. 'ది కేరళ స్టోరీ' వివాదంపై మూవీ టీమ్ స్పందన

by Disha Web Desk 13 |
మా లక్ష్యం ఉగ్రవాదులు.. ముస్లింలు కాదు.. ది కేరళ స్టోరీ వివాదంపై మూవీ టీమ్ స్పందన
X

న్యూఢిల్లీ: "ది కేరళ స్టోరీ" మూవీ కేరళను మత ఉగ్రవాద కేంద్రంగా చూపిస్తోందని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ చేసిన కామెంట్ పై ఆ సినిమా యూనిట్ సోమవారం స్పందించింది. సినిమాను బ్యాన్ చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండటం సరికాదని తెలిపింది. తమ మూవీలో కేరళ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమీ లేదని చిత్ర నిర్మాత విపుల్ షా స్పష్టం చేశారు. " సినిమాలో కేరళను కించపరిచే విధంగా ఏమీ చెప్పలేదు. ఈ చిత్రం ఉగ్రవాదులను టార్గెట్ చేసింది.. ముస్లింలను కాదు. ఈ సినిమాను చూడాలని కేరళ సీఎంను నేను కోరుతున్నాను" అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్ణయాలకు వచ్చే ముందు సినిమాను చూడాలని ప్రజలను కోరారు.

కొన్ని నెలల పాటు పరిశోధన చేసిన తర్వాతే ఈ సినిమాను తీశానని దర్శకుడు సుదీప్తో సేన్ చెప్పారు. "స్టోరీ రాసే క్రమంలో నేను ఎంతోమంది బాధితులతో మాట్లాడి చలించిపోయాను. ఆ ప్రభావంతో నా దృక్పథం మారిపోయింది. ఈ స్టోరీతో సినిమా తీయడానికి తొలుత నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఒక ప్రొడ్యూసర్ దొరికితే మూవీ తీశాను" అని వివరించారు. కేరళ సీఎం విజయన్‌ సొంత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కన్నూర్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో తమ మూవీ యూనిట్ పై దాడి జరిగిందని సుదీప్తో సేన్ అన్నారు. ఈ సినిమాలో నటించినందుకు అదా శర్మకు చాలా బెదిరింపు మెసేజ్ లు వచ్చాయని తెలిపారు.

Next Story