‘విపత్తు’ల నివారణకు మూడు భారీ పథకాలు.. రూ.8 వేల కోట్లతో ప్రకటించిన అమిత్ షా

by Dishafeatures2 |
Amit Shah Says, India Cant Develop Without Strong Cyber Security
X

న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం.. తదితర విపత్తులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు భారీ పథకాలను ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో అగ్నిమాపక దళ సేవలను ఆధునీకరించడం, ఏడు ప్రధాన నగరాల్లో వరదల నివారణ, 17 రాష్ట్రాల్లో కొండచరియలు విరిగి పడకుండా నిరోధించడం.. తదితర కార్యక్రమాలకు రూ.8 వేల కోట్ల విలువైన మూడు పథకాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ మంత్రుల సమావేశంలో అమిత్ షా సూచించారు. అగ్నిమాపక దళ సేవల ఆధునీకరణ, విస్తరణ కోసం అన్ని రాష్ట్రాలకు రూ.5 వేల కోట్లు అందిస్తామన్నారు. ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో వరదల ప్రమాదాన్ని తగ్గించేందుకు రూ.2,500 కోట్లు ఇస్తామన్నారు. 17 రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగి పడటాన్ని ఎదుర్కొనేందుకు రూ.825 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించిన వివరణాత్మక ప్రణాళికను త్వరలో రాష్ట్రాలకు పంపిస్తామని తెలిపారు.

కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొన్నాం

ఏడు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించే రాష్ట్రాలను నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (జాతీయ విపత్తు నివారణ కమిటీ) సందర్శించిందని, ఈ రాష్ట్రాలను దత్తత తీసుకొని విపత్తు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అమిత్ షా చెప్పారు. కరోనా మహమ్మారిని ప్రధాని మోడీ నాయకత్వంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు కలిసికట్టుగా ఎదుర్కొన్నారని, క్లిష్ట సమయాల్లో కేంద్రం, రాష్ట్రాలు, ప్రజలు కలిసి అన్ని రంగాల్లో విపత్తుపై ఎలా పోరాడతారో ప్రపంచానికి చాటి చెప్పామని అమిత్ షా చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే రైతులకు నష్టపరిహారం పెంచడాన్ని కేంద్రం పరిశీలిస్తుందని, రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సూచించారు. ‘ఆప్త మిత్ర’ పథకం కింద 350 విపత్తు పీడిత జిల్లాల్లో లక్ష మంది యువ వాలంటీర్లను సిద్ధం చేస్తున్నామని, విపత్తులను ఎదుర్కోవడంలో వీళ్లు సహాయకారిగా ఉంటారని అమిత్ షా చెప్పారు.


Next Story

Most Viewed