ఆర్టికల్ 21 కేసులనూ త్వరితగతిన విచారణకు చేపట్టకపోవడం తప్పే : సుప్రీం

by Dishanational4 |
ఆర్టికల్ 21 కేసులనూ త్వరితగతిన విచారణకు  చేపట్టకపోవడం తప్పే : సుప్రీం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టికల్ 21 రాజ్యాంగానికి ఆత్మలాంటిందని.. పౌరుల స్వేచ్ఛకు అదే అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21తో ముడిపడిన ఓ కేసును బొంబాయి హైకోర్టు త్వరితగతిన విచారణకు చేపట్టకపోవడం తప్పేనని తేల్చి చెప్పింది. న్యాయస్థానాలు ఈవిధంగా చేయడం వల్ల ప్రజల స్వేచ్ఛకు రక్షణ కవచంలా నిలిచే ఆర్టికల్ 21 అమలు డీలా పడుతుందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో ఓ కార్పొరేటర్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అమోల్ విఠల్ వాహిలే‌కు బెయిల్ మంజూరీ విషయంలో.. కేసులోని ఉచితానుచితాలను బొంబాయి హైకోర్టు పక్కనపెట్టి, బెయిల్‌పై తాత్సారం చేస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఆర్టికల్ 21 మేరకు వ్యక్తుల స్వేచ్ఛా సంబంధిత బెయిల్ వ్యవహారాలపై బొంబాయి హైకోర్టు త్వరితగతిన నిర్ణయాలను తీసుకోలేకపోతోందని బెంచ్ తెలిపింది. పౌరులకు ఉండే హక్కును ఏ విధంగా కాదంటారని నిలదీసింది. మహారాష్ట్రలోని పింప్రి-చించ్‌వాడ్ మున్సిపాలిటీ కార్పొరేటర్ అవినాష్ టెకవాడే హత్యకేసులో అమోల్ విఠల్ వాహిలే‌యే ప్రధాన నిందితుడు.వృత్తిపరమైన శత్రుత్వం కారణంగా టెకవాడే‌పై వాహిలే పగ పెంచుకున్నాడని.. 2015 సెప్టెంబర్ 3 ఇతరులతో కలిసి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 4న విఠల్ వాహిలే‌ను అరెస్టు చేశారు. ఈవిధంగా దాదాపు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వాహిలేకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎనిమిదేళ్లుగా జైలులో మగ్గుతున్నవాహిలే తనకు బెయిల్ ఇప్పించాలంటూ 2023 జనవరి 29న హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని వాహిలేకు హైకోర్టు సూచించింది.


Next Story

Most Viewed