రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణం

by samatah |
రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సభాపక్ష నేత పీయూష్ గోయల్ సమక్షంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సోనియాతో ప్రమాణం చేయించారు. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, సెక్రటరీ జనరల్ పీసీ మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సోనియా గాంధీ రాజ్యసభలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు కేవలం లోక్ సభకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పదవీకాలం పూర్తవడంతో సోనియా ఆ స్థానంలో రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సోనియాతో పాటు మరో 13మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. వారిలో కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ నేత ఆర్పీఎన్ సింగ్, పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ సభ్యుడు సమిక్ భట్టాచార్య తదితరులు ఉన్నారు.

కాగా, 1999లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి లోక్ సభకు పోటీ చేసిన సోనియా గాంధీ మొదటి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 నుంచి 2019వరకు వరుసగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈసారి పోటీ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోనియా గాంధీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed