టీఎంసీకి షాక్: సీనియర్ ఎమ్మెల్యే తపస్ రాయ్ రాజీనామా!

by Dishanational2 |
టీఎంసీకి షాక్: సీనియర్ ఎమ్మెల్యే తపస్ రాయ్ రాజీనామా!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ టీఎంసీకి రాజీనామా చేశారు. పార్టీ పని తీరుపట్ల నిరాశకు లోనైనట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ, ప్రభుత్వంపై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలతో విసిగిపోయాను. అలాగే సందేశ్ ఖాళీ సమస్యపై మమతా బెనర్జీ స్పందించిన తీరు కూడా సరికాదు’ అని చెప్పారు. జనవరిలో తన నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపినప్పుడు పార్టీ నాయకత్వం తనకు అండగా నిలవలేదని రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మమత సైతం తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదని చెప్పారు. తపస్ బీజేపీలో చేరనున్నట్టు కొంత కాలంగా కథనాలు వెలువడగా..వాటిని ఆయన కొట్టిపారేశారు.

విభేదాలే కారణమా?

ఉత్తర కోల్‌కతాకు చెందిన టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్, తపస్‌కు మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తపస్ పార్టీకి రిజైన్ చేయడం గమనార్హం. అయితే ఈ పరిణామాలపై రాయ్‌తో టీఎంసీ నాయకులు కునాల్ ఘోష్, బ్రత్యా బసులు భేటీ అయినప్పటికీ రాయ్ అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. కాగా, తపస్ రాయ్ 1990లో టీఎంసీ ప్రారంభించినప్పటి నుంచి మమతాకు సన్నిహితురాలిగా ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల టీఎంసీ ఉత్తర కోల్ కతా జిల్లా పదవి నుంచి ఆయనను తప్పించారు. అంతేగాక మంత్రి పదవి నుంచి సైతం తొలగించారు. ఈ క్రమంలోనే రాయ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed