నేతాజీ, ఆరెస్సెస్ లక్ష్యం ఒక్కటే.. భారత్‌ను గొప్పగా తీర్చిదిద్దడం: మోహన్ భగవత్

by Disha Web Desk 17 |
నేతాజీ, ఆరెస్సెస్ లక్ష్యం ఒక్కటే.. భారత్‌ను గొప్పగా తీర్చిదిద్దడం: మోహన్ భగవత్
X

న్యూఢిల్లీ: రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల లక్ష్యం దేశాన్ని గొప్పగా చేయడమేనని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ భాగస్వామ్యం మరువలేనిదని చెప్పారు. సోమవారం చంద్రబోస్ 126వ జయంతి పరాక్రమ్ దివాస్‌ని పురస్కరించుకుని కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రతి ఒక్కరూ బోస్ గుణాలను, బోధనలను అలవర్చుకుని దేశాన్ని 'విశ్వ గురువు' గా మార్చేందుకు కృషి చేయాలని భగవత్ కోరారు. అయితే ఆయన కలలుగన్న భారత్ ఇంకా నిర్మితం కాలేదని, దానిని చేరుకునేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. చంద్రబోస్ ముందుగా కాంగ్రెస్‌తో ఉండి సత్యగ్రహ్ ఆందోళనలో ఉన్నప్పటికీ, ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఇది సరిపోదని భావించి వేరే దారిలో వెళ్లారని అన్నారు. నేతాజీ ఆలోచనలే తాము అనుసరిస్తున్నామని, ఆయన లక్ష్యం తమ లక్ష్యం ఒకటేనని భగవత్ చెప్పారు.

భారత్ ప్రపంచానికి చిన్న రూపమని, మన దేశమే ప్రపంచానికి ఉపశమనం ఇస్తుందని నేతాజీ చెప్పారన్నారు. ఆ మార్గంలో మనమంతా నడుచుకోవాలని తెలిపారు. అయితే ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై పలువురి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆరెస్సెస్ హిందుత్వ దేశాన్ని కోరుకుంటే, నేతాజీ సెక్యులరిజాన్ని కోరుకున్నారని విమర్శించాయి. ఆరెస్సెస్, స్వతంత్ర సమరయోధుల భావజాలాలు ఒక్కటి కాదని ఆరోపించాయి.

Next Story

Most Viewed