రేప్ బాధిత మహిళపై కోర్టులోనే జడ్జి లైంగిక వేధింపులు ?!

by Dishanational4 |
రేప్ బాధిత మహిళపై కోర్టులోనే జడ్జి లైంగిక వేధింపులు ?!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ అత్యాచార బాధిత మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా కోర్టు రూంలోనే తనపై జడ్జి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ‘‘రేప్ కేసులో బాధితురాలిగా నా వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు త్రిపురలోని కమాల్‌పూర్‌ పట్టణంలో ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఛాంబర్‌లోకి వెళ్లాను. నేను స్టేట్‌మెంట్ ఇవ్వబోతుండగా జడ్జి అకస్మాత్తుగా దగ్గరికొచ్చి లైంగికంగా వేధించారు. దీంతో ఆ గది నుంచి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న లాయర్లకు, నా భర్తకు జరిగిన విషయాన్ని చెప్పాను’’ అని పేర్కొంటూ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి, కమాల్‌పూర్ బార్ అసోసియేషన్‌కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె భర్త కూడా కమాల్‌పూర్ బార్ అసోసియేషన్‌‌కు మరో ఫిర్యాదు ఇచ్చారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. జడ్జిపై వచ్చిన ఈ అభియోగాలపై ధలై జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి గౌతమ్ సర్కార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కమాల్‌పూర్‌లోని అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టును సందర్శించి విషయంపై విచారణ జరిపింది. మహిళ ఆరోపణలపై బార్ అసోసియేషన్ ముఖ్యుల అభిప్రాయాలు, పరిశీలనలను నమోదు చేసుకుంది. ఇక ఈ అంశంపై ఇప్పటిదాకా తమకు అధికారిక ఫిర్యాదు ఏదీ అందలేదని త్రిపుర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.పాండే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల మాదిరిగానే, తాను కూడా మీడియా ద్వారా ఆ ఘటన గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. సరైన ఫార్మాట్‌లో ఫిర్యాదు అందితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story

Most Viewed