అమిత్ షాతో రాజ్ థాక్రే భేటీ..ఉద్ధవ్‌కు షాకిచ్చేందుకేనా?

by Dishanational2 |
అమిత్ షాతో రాజ్ థాక్రే భేటీ..ఉద్ధవ్‌కు షాకిచ్చేందుకేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏ పార్టీ ఏ కూటమిలో చేరుతుందో, ఏ కూటమి నుంచి వైదొలగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బిహార్‌లో ఎన్డీయే కూటమి నుంచి ఆర్ఎల్‌జేపీ బయటకు రానున్నట్టు సంకేతాలు వచ్చాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దీంతో ఎంఎన్ఎస్ త్వరలోనే ఎన్డీయే గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేను ఢీకొట్టేందుకు బీజేపీ రాజ్ థాక్రేను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా మరాఠా ఓట్లను విభజించొచ్చని భావిస్తున్నట్టు సమాచారం.

రెండు సీట్లు డిమాండ్ చేస్తున్న ఎంఎన్ఎస్

ఎన్డీయేలో చేరడానికి రాజ్ థాక్రే రెండు లోక్ సభ సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైతోపాటు షిర్డీ స్థానాలను రాజ్‌థాక్రే అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబై సీటును రాజ్ థాక్రేకు కేటాయించనున్నట్టు సమాచారం. కాగా, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడి కుమారుడే రాజ్ థాక్రే..2006లో శివసేన నుంచి బయటకు వచ్చి ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలను ఎంఎన్ఎస్ గెలుచుకుంది. ఎక్కువగా ముంబై ప్రాంతంలోనే సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ముంబై లోక్ సభ సీటును ఎంఎన్ఎస్‌కు కేటాయిస్తే తప్పకుండా గెలుస్తామనే దీమాతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed