ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ : రాహుల్ గాంధీ

by Dishanational4 |
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, నేషనల్ బ్యూరో : తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ‘‘మన దేశంలో మహిళల జనాభా 50 శాతం.. హయ్యర్ సెకండరీ, ఉన్నత విద్యల్లోనూ మహిళల ఉనికి 50 శాతం.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలోనూ వారికి సగం వాటా దక్కాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘ఆదీ ఆబాదీ, పూరా హక్’’ నినాదంతో ముందుకు సాగుతామన్నారు. దేశాన్ని నడిపించే ప్రభుత్వంలోనూ మహిళలకు పురుషులతో సమానమైన వాటా దక్కాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో తక్షణమే మహిళా రిజర్వేషన్‌ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేశారు. సురక్షితమైన ఆదాయం, భవిష్యత్తు, స్థిరత్వం, ఆత్మగౌరవం ఉన్న మహిళలు సమాజానికి బలంగా నిలుస్తారని పేర్కొన్నారు. మహిళలు శక్తివంతమైతే భారతదేశ భవితవ్యం మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మహాలక్ష్మి’ స్కీం ద్వారా పేద కుటుంబానికి చెందిన ప్రతీ మహిళ బ్యాంకు అకౌంట్లో సంవత్సరానికి రూ.లక్ష జమచేస్తామన్నారు.


Next Story

Most Viewed