ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ

by Dishanational2 |
ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ
X

న్యూఢిల్లీ: ఉజ్బెకిస్థాన్ వేదికగా జరగబోయే 22వ షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుక్రవారం భేటీ కానున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చ, జీ20లో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

భారత్ అధ్యక్షతన ఈ ఏడాది డిసెంబర్‌లో ఐరాస భద్రతా మండలి, 2023లో జీ20 సదస్సు, ఎస్‌సీఓ సదస్సులు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీతో ప్రాముఖ్యత సంతరించనున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. అయితే ఈ భేటీకి సంబంధించి భారత విదేశాంగ శాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, ఈ నెల 15, 16వ తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఎస్‌సీఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.



Next Story

Most Viewed