పంజాబ్‌లో 'ఆర్ఆర్ఆర్' సీన్ రిపీట్.. తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్‌లో రణరంగం

by Disha Web Desk 13 |
పంజాబ్‌లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తుపాకులు, కత్తులతో పోలీస్ స్టేషన్‌లో రణరంగం
X

చండీగఢ్: ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో రామ్‌ చరణ్ ఎంట్రీ సీన్ గుర్తుందా..? వందలాది మంది ఆందోళనకారులు కర్రలతో ఓ పోలీస్ స్టేషన్‌పైకి దూసుకొచ్చి రణరంగం సృష్టిస్తారు. సరిగ్గా అలాంటి సీనే పంజాబ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ ముందు రిపీట్ అయింది. మతబోధకుడు, ఖలిస్తాన్ అనుకూల నాయకుడైన అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా వందలాది మంది మద్దతుదారులు అమృత్‌సర్‌లోని అజ్నాల పోలీస్ స్టేషన్ ముందు గురువారం రణరంగం సృష్టించారు.

బారికేడ్లను తొలగించి కత్తులు, తుపాకులు, కర్రలతో స్టేషన్‌ కాంపౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే.. స్వయం ప్రకటిత ఖలిస్తానీ నాయకుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్, అతని ఐదుగురు సహాయకులపై కిడ్నాప్, దొంగతనం, అల్లర్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం వంటి కేసులతో అరెస్టును ఎదుర్కొంటున్నారు.


ఈ క్రమంలోనే అతని సహాయకుల్లో ఒకరైన లవ్‌ప్రీత్‌ను కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ మద్దతుదారులు కత్తులు, తుపాకులు పట్టుకుని అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లను ఛేదించారు. ఈ నిరసనల్లో ఆరుగురు పోలీసు గాయపడ్డారు. భారీగా పోలీసు బలగాలను మోహరించినా ఫలితం లేకుండా పోయింది.

ఖలిస్తాన్‌ దేశాన్ని ఎందుకు డిమాండ్ చేయకూడదు..?

లవ్‌ప్రీత్ అరెస్టుపై అమృత్‌పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ రాజకీయ ఉద్దేశ్యంతోనే నమోదుచేశారని ఆరోపించారు. ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. గంటలో కేసు రద్దు చేయకపోతే, తర్వాత ఏం జరిగినా అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. 'ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకించినందుకు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మూల్యం చెల్లించుకున్నారు.

ప్రధాని మోడీ, అమిత్ షా లేదా భగవంత్ మాన్ సహా ఎవరొచ్చినా మమ్మల్ని ఎవరూ ఆపలేరు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మేము ఖలిస్తాన్ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో కొనసాగిస్తున్నాము. ప్రజలు హిందూ దేశాన్ని డిమాండ్ చేయగలిగినప్పుడు, ఖలిస్తాన్ కోసం మేమెందుకు డిమాండ్ చేయొద్దు' అని ప్రశ్నించారు. తనపై, తన మద్దతుదారులపై ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.

'లవ్‌ప్రీత్‌ను విడుదల చేస్తాం'..

అమృత్‌పాల్ మద్దతుదారుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో స్థానిక పోలీసులు దిగొచ్చారు. లవ్‌ప్రీత్‌ను కస్టడీ నుంచి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 'లవ్‌ప్రీత్ తూఫాన్ నిర్దోషి అని తగిన సాక్ష్యం ఇచ్చారు. దానిని సిట్ పరిశీలించింది. త్వరలోనే అతన్ని విడుదల చేస్తాము' అని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ వెల్లడించారు.

Next Story

Most Viewed