ఆధునికత నుంచి ఆధ్యాత్మికత దూరమైతే అరాచకమే : ప్రధాని మోడీ

by Dishanational4 |
ఆధునికత నుంచి ఆధ్యాత్మికత దూరమైతే అరాచకమే : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : జైనమతం సారాంశం విజయ మార్గం, విజేతల మార్గం అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భగవాన్ మహావీర్ బోధనలు యావత్ ప్రపంచానికి అహింస విలువను చాటిచెప్పాయని పేర్కొన్నారు. భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 2550వ భగవాన్ మహావీర్ నిర్వాన్ మహోత్సవ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంప్, నాణేలను ప్రధాని విడుదల చేశారు. రాబోయే వేల సంవత్సరాల పాటు భగవాన్ మహావీర్ బోధనలు ఈ ప్రపంచానికి అవసరమని చెప్పారు. భగవాన్ మహావీర్ విలువల పట్ల యువతకు ఉన్న అంకితభావం మరియు నిబద్ధత దేశం సరైన దిశలో ముందుకు సాగడానికి సంకేతం అని మోడీ అన్నారు. హింసతో అట్టుడుకుతున్న నేేటి ప్రపంచానికి శాంతిని ప్రసాదించే పరిష్కార మార్గంగా జైన సిద్ధాంతాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ వేదికలపై సత్యం, అహింసలను భారత్ ప్రస్తావిస్తుండటానికి ప్రాతిపదికలు కూడా భారతీయ ఆధ్యాత్మిక సూత్రాలే అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ అనే దార్శనికతతో ప్రపంచ దేశాలతో కలిసి భారత్ ముందుకు సాగుతోందన్నారు. “భారతదేశానికి నేటి ఆధునికత శరీరం లాంటిది.. ఆధ్యాత్మికత దాని ఆత్మ లాంటిది. ఆధునికత నుంచి ఆధ్యాత్మికత దూరమైతే అరాచకం పుడుతుంది’’ అని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్య చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, జైన సమాజానికి చెందిన ప్రముఖులు, సాధువులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed