యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్‌షో

by Dishanational4 |
యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ రోడ్‌షో
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ గ్లోబల్‌ సదస్సులో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్ అల్‌ నహ్యాన్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చేరుకున్నారు. నగరంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఘన స్వాగతం పలికారు. ఎయిర్ ‌పోర్టు నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్‌ షో జరిగింది. గాంధీనగర్‌- అహ్మదాబాద్‌‌లను అనుసంధానం చేసే ఇందిరా వంతెన వద్ద రోడ్ ‌షో ముగిసింది. ఈ రోడ్‌ షోలో మోడీ, షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్ అల్‌ నహ్యాన్‌‌ను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. ప్రధాని మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

మోడీ ట్వీట్ ఇదీ..

అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘‘వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో పాల్గొనేందుకు నా సోదరుడు (యూఏఈ అధ్యక్షుడు) మహ్మద్​ బిన్ జాయెద్​ రావడం చాలా ప్రత్యేకం. ఈ సదస్సుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ వేదిక గుజరాత్​కు ఎలా తోడ్పడిందో.. అనేక మందికి ఎలా అవకాశాలను సృష్టించిందో తలుచుకొని నేను ఎంతో సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్​ గ్లోబల్ సదస్సును ప్రధాని మోడీ బుధవారం ఉదయం 9.45 గంటలకు ప్రారంభిస్తారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఇందుకు వేదికగా నిలువనుంది. 34 దేశాలకు చెందిన కీలక నేతలు, 16 సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు దేశాల నేతలతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈనెల 12వ తేదీన సదస్సు ముగుస్తుంది.





Next Story