ఈడీ ఆఫీస్‌కు ప్రతిపక్షాలు.. ఝలక్ ఇచ్చిన పోలీసులు!

by Disha Web Desk 17 |
ఈడీ ఆఫీస్‌కు ప్రతిపక్షాలు.. ఝలక్ ఇచ్చిన పోలీసులు!
X

న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై విచారణ జరపాలని కోరేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. బుధవారం పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి బయల్దేరాయి. కానీ ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రతిపక్షాల రాక సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నిరసన ర్యాలీని విరమించుకోకపోతే అమల్లో ఉన్న 144వ సెక్షన్ కింద అందరినీ అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో 18 పార్టీల నేతలు నిరసన ర్యాలీని విరమించుకుని పార్లమెంట్‌కు వచ్చారు. ఈడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

బుధవారం ఉదయం అదానీ అంశంపై ఉమ్మడి వ్యూహాన్ని సమన్వయం చేసుకునేందుకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి నేతలందరూ వచ్చారు. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు, దీనిపై విచారణ జరపాలని ఒత్తిడి చేసేందుకు ఈ నేతలంతా ఈడీ కార్యాలయానికి వెళ్లాలనుకున్నారు. అయితే బీజేపీ దీనిని అవినీతి పరుల ర్యాలీగా అభివర్ణించింది. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు కోరుతున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed